వ్యవసాయ శాఖలో అలజడి..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

‘జిల్లా వ్యవసాయశాఖలో తీవ్ర అలజడి నెలకొందా.. ఆ శాఖ ఉద్యోగులు జిల్లా అధికారిపై తిరుగుబాటుకు దిగారా.. వ్యవసాయశాఖలో పని చేస్తున్న ఉద్యోగులను ఆ శాఖ ఉన్నతాధికారి వై.రామకృష్ణ వేధింపులకు గురి చేస్తున్నారంటూ.. ఆ వేధింపులు తాళలేక ఆ శాఖలో పని చేసే ఉద్యోగులంతా మూకుమ్మడిగా రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారా’ అంటే అవుననే సమాధానం వస్తోంది. జిల్లా జనాభాలో 80 శాతం ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. నిరంతరం ప్రజలతో మమేకమయ్యే వారిలో వ్యవసాయ శాఖాధికారులది ప్రత్యేక పాత్ర. ప్రజలకు అత్యంత ముఖ్యమైన వ్యవసాయశాఖలో నెలకొన్న పరిణామాలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. 2022 ఏప్రిల్‌ నాలుగో తేదీన జిల్లాల విభజన అనంతరం వై.రామకృష్ణ ఏలూరు జిల్లా వ్యవసాయాధికారి (డిఒఎ)గా బాధ్యతలు తీసుకున్నారు. రామకృష్ణ జిల్లా అధికారిగా వచ్చాక కార్యాలయంలో పని చేసే అధికారులు, సిబ్బందిపై చిన్న చిన్న విషయాలకు అందరి ముందు అవమానించడం, ఆడ, మగ తేడా లేకుండా దూషించడం వంటి చేష్టలకు పాల్పడుతున్నారని, దీంతో ఉద్యోగులు మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. జిల్లాల విభజన తర్వాత సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కష్టపడి పనిచేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నా జిల్లా అధికారి తమ కష్టనష్టాలను ఏమీ పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులో ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. బయటికి చెప్పుకోలేని భాషను వాడుతున్నారని పేర్కొన్నట్లు సమాచారం. కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు రెండు దారులు మాత్రమే కన్పిస్తున్నాయని, ఒకటి ఉద్యోగం మానేసి వెళ్లిపోవడం, లేదా చావే శరణ్యం అన్నట్లుగా ఉందని ఫిర్యాదులో పేర్కొనడం చూస్తే వ్యవసాయ శాఖలో ఏం జరుగుతుందో అనే అనుమానాలు నెలకొన్నాయి. జనవరి ఒకటో తేదీ వేడుకలకు ఏర్పాట్లు సరిగా చేయలేదని తీవ్ర పదజాలంతో దూషించారని, మీ అంతు చూస్తానని బెదిరించారని ఉద్యోగులు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. ఇలా అనేక విషయాలను ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదులో ఉద్యోగులు వివరించారు. అంతేకాకుండా సాయంత్రం ఆరు తర్వాత కార్యాలయానికి వచ్చి రాత్రి పొద్దుపోయే వరకూ పని చేయాలని హుకుం జారీ చేస్తారని ఆరోపించారు. గతంలో ఒకసారి ఈయనపై అప్పటి కమిషనర్‌ పూనం మాలకొండయ్యకు ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అప్పుడు అందరితో మాట్లాడి సమస్యను సర్దుబాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ వేధింపులు పెరిగిపోవడంతో ఉద్యోగులు మరోసారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని జిల్లా వ్యవసాయ అధికారి తీరుపై విచారణ జరిపించాలని ఉద్యోగులంతా కోరుతున్నారు. ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి. జిల్లాలో కీలకమైన వ్యవసాయశాఖ అధికారిగా ఉన్న ఈయన రైతులతోపాటు, ఎవరు ఫోన్‌ చేసినా అసలు స్పందించరనే విమర్శలు సైతం ఉన్నాయి.పని గురించే తప్ప.. వేరేవిధంగా మాట్లాడలేదువై.రామకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి ఉద్యోగుల ఫిర్యాదుపై జిల్లా వ్యవసాయాధికారి వై.రామకృష్ణను వివరణ కోరగా ఉద్యోగులు తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. వ్యవసాయశాఖకు సంబంధించిన పనులు, ఫీల్డ్‌ యాక్టివిటీలో అన్ని రకాలుగా జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నామని, పని గురించి తప్ప వేరేవిధంగా మాట్లాడింది లేదని అన్నారు. పనిలో భాగంగా కోప్పడటం, తిట్టడం సాధారణంగా జరుగుతోందని, ఇదంతా పనిమీదనే తప్ప అంతకంటే ఏమీ ఉండదని తెలిపారు. బూతులు తిడితే ఆ రోజే ఫిర్యాదు చేయవచ్చు.. అలాకాకుండా ఇప్పుడు ఫిర్యాదుచేయడం ఏమిటో తెలియడం లేదని, పని గురించి తప్ప అంతకు మించి ఏమీ మాట్లాడ లేదని స్పష్టం చేశారు.

➡️