శరవేగంగా కులగణన

Feb 2,2024 23:12

ప్రజాశక్తి-తెనాలి : సుదీర్ఘంగా ఎదురుచూసిన కులగణన ఎట్టకేలకు ప్రారంభమైంది. గతనెల 19 నుంచి ప్రారంభమైన కులగణన 28కి ముగించాల్సి ఉంది. అయితే ఈ గడువును ఈనెల 4 వరకూ పెంచారు. జరిగే కులగణనలో వార్డు, గ్రామ వాలంటీర్లతోపాటు సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో నిమగమయ్యారు. సచివాలయంలో ఒక్క డిజిటల్‌ అసిస్టెంట్‌ మినహా అంతా ఇంటిటి సర్వేకు పరిమితమయ్యారు. కులంతో పాటు ఆదాయం, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో కులగణన జరపాలని, కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించి, అన్ని రంగాల్లో కులాల వారీగా జనాభా దామాషా ప్రకారం ప్రాధాన్యం కల్పించాలనే డిమాండ్‌ రాజకీయ పార్టీలు, కులసంఘాల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఎట్టకేలకు కులగణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం గతనెల 19 నుంచి సర్వే ప్రారంభించాలని ఆదేశించింది. కులగణనలో వార్డు/గ్రామ వాలంటీర్‌తో పాటు సచివాలయ సిబ్బందికి విధులు కేటాయించింది. ఈ నేపథ్యంలో వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బందిలో డిజిటల్‌ అసిస్టెంట్‌ మినహా మిగిలిన వారంతా సర్వేలకు అంకితమయ్యారు. ఇంటింటికి తిరగి లెక్కలు సేకరిస్తున్నారు. వాస్తవానికి జనవరి 28లోగా కులగణన పూర్తి చేయాలని తొలుత నిర్ధేశించినా, ఆ గడువును ఈనెల 4 వరకూ పెంచారు. గడువులోగా ఏవైనా కుటుంబాలు మిగిలిపోతే మరో వారం సచివాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. సర్వేను ఈనెల 15కు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా సేకరిస్తున్న వివరాలవేవార్డు/గ్రామ వాలంటీర్‌తో పాటు సచివాలయ సిబ్బంది సమిష్టిగా వివరాలు సేకరించాల్సి ఉంది. ముందుగా వాలంటీర్‌ తన ఆధార్‌ నెంబర్‌తో కాకుండా సిఎఫ్‌ఎంఎస్‌ ఐడి ద్వారా కులగణనకు నిర్ధేశించిన యాప్‌లో ఎంటర్‌ కావాలి. అప్పుడు ఆ ప్రాంత వాలంటీర్‌ పేరుకూడా యాప్‌లో ప్రత్యక్షమౌతుంది. బయోమెట్రిక్‌, ఐరిష్‌, ఫేషియల్‌ ఈ మూడింటిలో ఏదో ఒక ప్రామాణికం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి. ముగింపులో వార్డు వాలంటర్‌తో పాటు, సచివాలయ సిబ్బంది ఇరువురూ ఈకేవైసి ద్వారా డేటాను ధ్రువీకరించాలి. కుటుంబ యజమాని, లేదా కుటుంబం మొత్తం చనిపోతే దానిని వాలంటీర్‌, సచివాలయ సిబ్బంది ఈకేవైసి ద్వారా దృవీకరించాలి. ప్రాథమికంగా కుటుంబ యజమాని, కుటుంబ సభ్యులు, వారి కులం, చదువు, వృత్తి, ఆదాయం, ఇల్లు, పొలాలు, కార్లు, ద్విచక్రవాహనాలు, రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులు, గ్యాస్‌ కనెక్షన్‌ వంటి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వేలో 8 సంవత్సరాల లోపు వయస్కులకు మినహాయింపు ఉంది. సర్వేలో కుటుంబ సబ్యులందరి ఈకేవైసి అనివార్యం. కుటుంబ యజమాని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధిదారుగా ఉంటే వారి వివరాలు ఆటో మేటిక్‌గా సిస్టమ్‌లో ప్రత్యక్షమౌతున్నాయి. సంక్షేమ పథకాల్లో లబ్దిదారులు కాని వారి వివరాలు దాదాపుగా పూర్తిస్థాయిలో నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే లబ్ధిదారులుగా ఉన్న వారి వివరాలు ముందుగానే సచివాయం, వార్డు వాలంటరీర్ల వద్ద నిక్షిప్తమైన నేపధ్యంలో వారి లెక్కలు సేకరించటం తేలికే. సంక్షేమ పథకాల్లో లబ్దిదారులు కాని వారి వివరాల సేకరణలో అన్ని వివరాలు ఎందుకన్న ప్రశ్నలు ఎదురౌతున్నట్లు కొందరు సిబ్బంది చెబుతున్నారు. కాస్తోకూస్తో విద్యావంతులుగా ఉన్నవారు ఈ సమాచారం ఎందుకని ప్రశ్నించే అవకాశం ఉంది. కాని నిరక్ష్యరాస్యులు ప్రశ్నించకపోగా వాలంటర్‌, సచివాలయ సిబ్బంది పొందుపరచిన వివరాలను బయోమెట్రిక్‌ ద్వారా ధ్రువీకరిస్తున్నారు. ఈ సర్వే ద్వారా కులగణన పేరిట అధికారులు పూర్తిస్థాయిలో సేకరిస్తున్న వివరాలను కులగణనకు మాత్రమే పరిమితం కాకుండా దీనిని ‘క్యాస్ట్‌ కమ్‌ సోషియో ఎకనమిక్‌ సర్వే’గా కూడా భావించాల్సిన పరిస్థితి ఉంది.దాదాపు 80 శాతం పూర్తి కావచ్చిన సర్వేకులగణన ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తయినట్లు సర్వేలో నిమగమైన సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో 25 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్‌కు కనీసంగా 70 కుటుంబాలుంటాయి. ప్రతి క్లస్టర్‌లో రోజుకు కనీసం 10 నుంచి 15 కుటుంబాల వివరాలను సర్వే సిబ్బంది సేకరిస్తున్నారు. పట్టణంలో మొత్తం 47 సచివాలయాల పరిధిలో సర్వే 80 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. వార్డు వాలంటీర్‌ వద్ద డేటా సురక్షితమేనా?వార్డు/గ్రామ వాలంటీర్‌, సచివాలయ సిబ్బంది సమిష్టిగా చేస్తున్న కులగణనలో వాలంటీర్‌ పాత్ర కీలకంగా ఉంది. పైగా వాలంటీర్‌ తన ఆధార్‌తో కాకుండా సిఎఫ్‌ఎంఎస్‌ ఐడిద్వారా యాప్‌లో కుటుంబ వివరాలు నమోదు చేస్తున్నారు. సేకరించిన టేడా ఎప్పటికప్పుడు సేవ్‌ చేసే అవకాశం కూడా యాప్‌లో కల్పించారు. కులగణన పేరుతో కేవలం కులమే కాకుండా కుటుంబం యావత్తు సామాజిక, ఆర్థిక స్థితిగతులను కూడా సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఒక కుటుంబం మొత్తానికి వారికి ఉన్న స్థిర, చరాస్తులు, వృత్తి, ఉద్యోగం, ఆదాయం వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. ఇంత లోతుగా వివరాలు సేకరిస్తున్న క్రమంలో కులగణకు ఇన్ని వివరాలెందుకన్న ప్రశ్నలూ ఎదురౌతున్నాయి. పైగా ప్రైవేటు ఉద్యోగి, ఒక్క మాటలో చేప్పాలంటే ప్రభత్వానికి అనుకూలంగా వ్యవహరించే వాలంటీర్‌ ద్వారా సేకరిస్తున్న సమాచారానికి రక్షణ ఏమిటి, భవిష్యత్‌లో ఏవైనా సమస్యలు ఎదురౌతాయా? అనే ఆందోళన కూడా ప్రజల్లో లేకపోలేదు.

➡️