శాశ్వత ఉద్యోగులకే పోలింగ్‌ విధులు

Mar 29,2024 23:30

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న జరగనున్న పోలింగ్‌ ఏర్పాట్లపై జిల్లా అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా సిబ్బంది ఎంపిక, శిక్షణ, విధుల కేటాయింపు, ఒక నియోజకవర్గంలో పనిచేస్తున్న వారికి మరొక నియోజకవర్గంలో విధులు నిర్వహించేలా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో ఆరుగురు ఉద్యోగులు ఉంటారు. ప్రిసైడింగ్‌ అధికారిగా ప్రభుత్వ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, లేదా స్కూల్‌ అసిస్టెంట్‌లను నియమిస్తారు. మిగతా సిబ్బంది ఎస్‌జిటి, ఇతర టీచర్లను ఎంపిక చేస్తారు. వీరితోపాటు ఒక సచివాలయం ఉద్యోగి కూడా ఉంటారు. సచివాలయం ఉద్యోగికి కేవలం ఓటర్లకు ‘సిరా’ మార్కును వేసే బాధ్యతను అప్పగిస్తారు. ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్నందున వివిధ శాఖల్లో పనిచేస్తున్న వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగుల కూడా పోలింగ్‌ బాధ్యతలను అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. పోలింగ్‌ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది మొత్తం ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే వారుండాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది. ప్రభుత్వం పరిధిలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతారు. అంగన్‌వాడీ వర్కర్లతోపాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులనూ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉద్యోగుల జాబితాలను జిల్లా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో ఆరుగురు ఉద్యోగులతో పాటు మొత్తంగా 20 శాతం మంది ఉద్యోగులను రిజర్వులో ఉంచాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అధ్యాపకులు సరిపోకపోవడం వల్ల ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యాపకులను వినియోగించాలని భావించినా ఆయా కళాశాల యాజమాన్యాలు, నిర్వాహకులకు రాజకీయ పార్టీలతో అనుబంధంగా ఉండటం వల్ల చివరిలో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని అంగన్‌వాడీ వర్కర్లను వినియోగించారు. కానీ ఈసారి వీరికీ అవకాశం ఇవ్వరాదని నిర్ణయించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రాష్ట్రం మొత్తం మీద దాదాపు లక్షా 10 వేల మంది ఉద్యోగులు ఉన్నా వీరిలో కేవలం 30 శాతం మందినే పోలింగ్‌కు వినియోగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 15 వేల మంది సచివాలయం ఉద్యోగులు ఉండగా ఐదు వేల మందికే ఎన్నికల విధులు కేటాయించే అవకాశం ఉంది. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో ఒక సచివాలయం ఉద్యోగిని నియమించాలనే నిబంధన వల్ల వీరిలో అందరికీ ఈ విధులు అప్పగించే అవకాశం లేదు. మిగతా సచివాలయం ఉద్యోగులకు ఇతర బాధ్యతలు అప్పగిస్తారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల విధుల దూరంగా ఉండాలని కొంత మంది ఉద్యోగులు ఇప్పటికే వివిధ రూపాల్లో జిల్లా ఎన్నికల అధికార్లకు విజ్ఞాపనలు అందిస్తున్నారు. అంతేగాక వేర్వేరు కారణాల వల్ల అప్పటికప్పుడు కొంత మంది గైర్హాజరు అయితే ఇబ్బంది లేకుండా ఉండేందుకు 20 శాతం రిజర్వు ఉద్యోగులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని అధికార వర్గాలు తెలిపాయి.

➡️