శాస్త్రీయ దృక్పథంతోనే సమస్యలకు పరిష్కారం: జెవివి

ప్రజాశక్తి-చీమకుర్తి: నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించినపుడే పరిష్కారం దొరుకుతుందని జెవివి జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్‌ బి జవహర్‌ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక జవహర్‌ నర్సింగ్‌ హోంలో జరిగిన జెవివి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలలో, సమాజంలో నెలకొన్న మూఢవిశ్వాలను, చాంధస ధోరణులను అరికట్టేందుకు విద్యావంతులుగా, సైన్స్‌ కార్యకర్తలుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51లో పేర్కొన్న ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండేలా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ జయప్రకాష్‌ మాట్లాడుతూ ఎఐసిఎస్‌ఎన్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం కోసం సైన్స్‌, లౌకికవాదం కోసం సైన్స్‌ నినాదాలలో శాస్త్రీయ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జెవివి జిల్లా ఉపాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జెవివి, యుటిఎఫ్‌ నాయకులు చలువాది రమేష్‌, ఎస్‌కె శిలార్‌, ఎస్‌కె అక్బర్‌, మన్నం సుబ్బారావు, పి దేవదాసు, బి ఆంజనేయులు, వీరారెడ్డి, ఎం వెంకటరావు, నాగేశ్వరరావు, చాట్ల శ్రీను, పీరుసాహెబ్‌, సిఐటియు నాయకులు పూసపాటి వెంకటరావు, ఎం ప్రసాదు పాల్గొన్నారు.

➡️