శివరాత్రి వేడుకల్లో భక్తుల ఇక్కట్లు

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకలలో భక్తులకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. శివరాత్రి వేడుకలలో భాగంగా శుక్రవారం రాత్రి నారాయణస్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తి వారి కళ్యాణం, స్వామి వారి గ్రామోత్సవం, గండ దీపోత్సవం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ట్రస్ట్‌ బోర్డు సిబ్బంది భక్తులకు సరైన వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. తాగేందుకు నీళ్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. షాపులలో 20 రూపాయల నీళ్ల బాటిల్‌ని 30 రూపాయలకు కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన పాట కచేరీ ప్రాంతంలో స్టేజీకి అతి సమీపంలో ఆలయ అధికారులు తమ కార్లను పార్కింగ్‌ చేయడంతో పాట కచేరీని వీక్షించే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్టేజీకి ఎడమవైపు ఉన్న గుంతపై మూత వేయకపోవడంతో పలువురు భక్తులు ఆ గుంతలో పడినట్లు చెప్పారు. గండ దీపోత్సవం కార్యక్రమం ఉందంటూ శుక్రవారం రాత్రి దాదాపు రెండు గంటల పాటు స్వామి వారి దర్శనం నిలిపివేయడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అనేక పర్యాయాలు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మహిళా భక్తులు భయాందోళన చెందారు.

➡️