శిశువులను అపహరిస్తే గుర్తించే అలారం

Feb 24,2024 00:19

ట్యాక్‌ను అందిస్తున్న సూపరింటెండెంట్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో శిశువుల అపహరణను అరికట్టేందుకు ప్రణాళికను రూపొందించినట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ చెప్పారు. కాన్పుల వార్డు వద్ద రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. గత కొంతకాలంగా కాన్పుల వార్డు, ప్రసూతి వార్డులలో శిశువుల అపహరణ జరుగుతున్న నేపథ్యంలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. పుట్టిన శిశువులకు, తల్లులకు ఒక ట్యాగ్‌ వేసి వారిద్దరూ వేరుకాకుండా ఉండేందుకు నిఘా పెడతామని, ఎవరైన శిశువుల అపహరణకు పాల్పడితే వెంటనే గుర్తించే విధంగా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ట్యాగ్‌లను ఎవరైనా తొలగించాలని ప్రయత్నిస్తే వెంటనే అలారం సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేస్తుందని వివరించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం 40 రీడర్లు, అలారంలను అమర్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్న ఇన్‌ఫాంట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు ఖర్చు పెడుతుందని, తొలివిడతగా రూ.7 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.

➡️