‘శ్మశానవాటికలకు నోచని దళిత గ్రామాలు’

ప్రజాశక్తి-పీలేరు దేశానికీ స్వాతంత్య్రం సిద్దించి 77 ఏళ్ళైనా శ్మశానవాటికలకు నోచుకోలేక దళిత గ్రామాలు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయని మాలమహనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మాలమహనాడు రాయలసీమ జిల్లాల సహయ కార్యదర్శి నగరిమడుగు సుభాష్‌ ఆధ్వర్యంలో గురువారం పీలేరు మాలమహనాడు మండల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీల గ్రామాల్లో ఎవరైనా మరణిస్తే మతదేహలు ఖననం చేసేందుకు జానడు జాగా లేక ఇప్పటికీ వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో, ఖనన సంస్కారాలు చేసుకునే దౌర్భాగ్య స్థితి దళిత గ్రామాల్లో నెలకొందన్నారు. ఈ సమస్యపై ప్రజాప్రతినిధులకు, జిల్లా స్థాయి అధికారులకు, మండల స్థాయి అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చుకున్నా ఫలితం శూన్యమని తెలిపారు. ఎస్సీ గ్రామాల జనాభా నిష్పత్తి ఆధారంగా 0.5 సెంట్లు మొదలు ఎకరం వరకు శ్మశానవాటికల కోసం భూమి కేటాయించేందుకు, ప్రతి జిల్లా కలెక్టర్‌ 45 రోజుల్లోగా శ్మశానవాటికలు లేని గ్రామాలను గుర్తించి ఆ సమస్యను పరిష్కరించాలని 2022 అక్టోబర్‌ 2న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు జారీచేసి ఏడాదిన్నర కాలం అవుతున్నా ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలోని ఏ ఎస్సీ గ్రామంలోనూ అది అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆదేశాలను అమలయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. లేదంటే మండల రెవెన్యూ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతామన్నారు. జిల్లా పరిపాలన అధికారి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాలమహనాడు జిల్లా ఉపాధ్యక్షులు జెట్టి మల్లికార్జున, మాలమహనాడు పీలేరు మండల ప్రచార కార్యదర్శి డప్పేపల్లి ఆనంద్‌, తుమ్మల రవి కుమార్‌ పాల్గొన్నారు.

➡️