షోకాజ్‌ నోటీసు కాపీలు దహనం

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

తక్షణం విధుల్లోకి చేరకపోతే సమగ్ర శిక్ష ఉద్యోగులను తొలగిస్తామంటూ జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌ కాపీలను సమగ్ర శిక్ష అభియాన్‌ కార్యాలయం వద్ద ఉద్యోగుల దహనం చేశారు. నోటీసులకు బెదిరేది లేదని, బెదిరింపులతో ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం చూస్తుందని, తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకూ పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమ్మె శనివారానికి 18వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌ వద్ద తమ నిరసన తెలిపారు. ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జెఎసి నేతలు మాట్లాడుతూ విద్యాశాఖలో కీలకపాత్ర వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శిం చారు. సిఎం జగన్‌ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు పిఆర్‌సి అమలు చేయకుండా నెలల తరబడి వేతనాలు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జెఎసి నాయకులు వినోద్‌, జాన్సీ, భగవాన్‌, రాజు, రాధిక, కేశవరావు, సత్య, సందీప్‌, దిలీప్‌ పాల్గొన్నారు.

➡️