సంక్రాంతికీ సాగని వ్యాపారాలు

కొనుగోలుదారులు లేక బోసిపోయిన సీలేరు దుకాణాలు

ప్రజాశక్తి -సీలేరు

సంక్రాంతి సీజన్‌లోనూ జీకే వీధి మండలం సీలేరులో వ్యాపారాలు సాగడం లేదు. కొనుగోలుదారుల్లేక సీలేరు బోసిపోయింది. వారం రోజుల నుంచి వ్యాపారాలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి ఏటా సంక్రాంతికి పెద్ద మొత్తంలో వ్యాపారం సాగేది. సంక్రాంతి ముందు ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతం చుట్టుపక్కల నుంచి గిరిజనులు తీర్థాలను తలపించే విధంగా సీలేరు చేరుకొని వారికి కావలసిన బట్టలు, సరుకులు కొనుగోలు చేసి వెళ్లేవారు. ఈ ఏడాది కూడా ఎప్పటి మాదిరిగానే వ్యాపారం సాగుతుందని భావించిన వ్యాపారులకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా పంటలు సరిగా పండలేదు. మరో వైపు అరకొరగా పండిన పంటలు తుపాను రావడంతో ఆ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట చేతికి రాక గిరిజనుల దగ్గర డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. దీంతో బట్టలు, సరుకులు కొనుగోలు చేయడానికి గిరిజనులు రాలేదు. దీనికి తోడు పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు ఏర్పాటు కావడంతో గిరిజనుల చెంతకే వ్యాపారులు వెళ్లి వారికి కావలసిన బట్టలు, నిత్యవసర సరుకులు విక్రయిస్తున్నారు. మరి కొంతమంది గిరిజన గ్రామాల్లో చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేసి గిరిజనులకు అన్ని సరుకులు అందుబాటులో తీసుకొచ్చారు. దీంతో మారుమూల గ్రామాల నుంచి గిరిజనులు సీలేరులో దుస్తులు, నిత్యాసరుకులు కొనుగోలు చేయటానికి సీలేరు రావడం లేదని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. సీలేరు సమీపంలోని ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా చిత్రకొండకు ఒడిశా ప్రభుత్వం తక్కువ ఛార్జీలతో బస్సు ఏర్పాటు చేయడం ఆ పరిసర గ్రామాల గిరిజనులు అక్కడకు వెళ్లి వారి కావలసిన బట్టలు, నిత్యవసర సరుకులు, ఇతర సామగ్రి కొనుగోలు చేసి వారి గ్రామాలకు బస్సులో వెళ్ళిపోతున్నారు. దీంతో సీలేరు రావటానికి గిరిజనులు ఆసక్తి చూపడం లేదు. మరో వైపు ఆన్‌లైన్‌ వ్యాపారం కూడా స్థానికంగా వ్యాపారాలను దెబ్బతీస్తోంది. సీలేరుకు మారుమూల గ్రామాల నుంచి గిరిజనులు రాకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్‌ నిర్మానుష్యంగా ఉంటుంది.

➡️