సచివాలయాలు దేవాలయాలు : మంత్రి బొత్స

Mar 2,2024 20:08

  ప్రజాశక్తి-గజపతినగరం :  ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం అవుతాయనే నమ్మకంతో దేవాలయాల మాదిరి ప్రజలు సచివాలయాలకు వెళ్తున్నారని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 30 మంది సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అంగన్వాడీ, ఎఎన్‌ఎంలు సేవలందిస్తున్నారని, గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగే వారని, ఇపుడు ఇంటికే వచ్చి సేవలందిస్తున్నారని అన్నారు. గజపతినగరం మండలం గంగచోళ్లపెంటలో ఆర్‌బికెను, వెల్నెస్‌ కేంద్రాన్ని, గంగచోళ్లపెంటనుంచి పట్రువాడ వెళ్లేందుకు చంపావతి నదిపై రూ. 4.30 కోట్లతో నిర్మించిన వంతెనను శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభ లో మంత్రి బొత్స మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లి వారి అవసరాలను, కష్టాలను తెలుసుకునే సచివాలయ ఉద్యోగులు ఉన్నత చదువులు చదివి వారి ప్రతిభతో వచ్చిన వారేనని తెలిపారు. సచివాలయంలో మీరిచ్చే వినతులు ఏమైనా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి వెంటనే మంజూరై వస్తాయని అన్నారు. పింఛను కోసం గ్రామంలో 8 మంది దరఖాస్తులు చేసుకున్నారని, వారికి జూన్‌ నుండి పింఛను అందుతుందని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య మాట్లాడుతూ 5 ఏళ్లలో ఈ గ్రామానికి రూ.14 కోట్లు ఖర్చు చేశామన్నారు. జెజెఎం కింద ఇంటింటికీ కుళాయిలు వేసే కార్యక్రమం లో ట్యాంక్‌లు పూర్తి చేశామని తెలిపారు. ఎన్నో ఏళ్ల కళ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే ను తీసుకు వచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి డాక్టర్‌ సురేష్‌ బాబు, సహాయ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, బొబ్బిలి ఆర్‌డిఒ కె.సందీప్‌, తహశీల్దార్‌ రమేష్‌, ఎంపిడిఒ జయంత్‌ ప్రసాద్‌, ఎంపిపి బెల్లాన జ్ఞాన దీపిక, జెడ్‌పిటిసి గార తౌడు, సర్పంచ్‌ సంగమయ్య, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️