సచివాలయ వ్యవస్థతోనే గ్రామస్వరాజ్యం

Feb 16,2024 21:20

 ప్రజాశక్తి – సీతానగరం : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సచివాలయం వ్యవస్థతోనే సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే ఎ.జోగారావు అన్నారు. మండలంలోని తామరఖండిలో రూ.43లక్షల నిధులతో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, రక్షితమంచినీటి పథకాన్ని, బోరును ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో గ్రామంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా నేరుగా ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. అలాగే గ్రామంలో వందల మీటర్లు సీసీ కాలువలు, రోడ్లతో పాటు నాడు-నేడు ద్వారా పాఠశాలను అభివృద్ధి చేశామని, ఇంటింటికి కుళాయిలు ద్వారా తాగు నీరు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి బలగ రవణమ్మ, బలగ శ్రీరాములు నాయుడు, జెడ్పీటీసీ మామిడి బాబ్జీ, మండల వైసిపి అధ్యక్షులు బొంగు చిట్టి రాజు, ఎంపిడిఒ ఎం.ఈశ్వరరావు, ఎఒ ప్రసాద్‌, ఎంపిటిసి ఏగిరెడ్డి గౌరీశ్వరి శ్రీనివాసరావు, సర్పంచ్‌ వెంకటనాయుడు, పిఎసిఎస్‌ అధ్యక్షులు మూడడ్ల మన్మధరావు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో గెడ్డలుప్పి, తామరకండి, ఆర్‌.వెంకంపేట, చినబోగిలి గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న వాలంటీర్ల సేవలను కొనియాడారు. తామరఖండి సచివాలయం ప్రారంభం అనంతరం ఆ వేదికపై వారందరినీ ఎమ్మెల్యే ఘనంగా సత్కరించి, సన్మానించారు.

➡️