సత్తెనపల్లిలో ప్రధాని మోడీ శవయాత్ర

Feb 27,2024 00:15

మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సంఘాలు
ప్రజాశక్తి-సత్తెనపల్లి :
ఢిల్లీ సరిహద్దులలో నిరసన తెలుపుతున్న రైతులపై దాడులు చేయించి ఒక యువరైతు మృతికి కారణమైన హంతకుడు, కార్మిక ద్రోహి ప్రధాని మోడీ అని, బిజెపిని ఇక సాగనంపాలని రైతు సంఘం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య అన్నారు. రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రద్దు చేస్తానన్న నల్ల చట్టాలను దొడ్డి దోవలో అమలు చేస్తున్న నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలకు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులపై దాడులు అన్యాయమన్నారు. ఈ దాడులకు నిరసనగా రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సత్తెనపల్లిలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహన ర్యాలీ, మోడీ శవ యాత్ర చేశారు. అనంతరం ఐదు లాంతర్ల సెంటర్లో జాతీయ రహదారిపై మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తాలూకా సెంటర్లో జరిగిన సభకు రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ అధ్యక్షత వహించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.మల్లేశ్వరి, కౌలురైతు సంఘం మండల కార్యదర్శి పి.మహేష్‌, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎ.వీరబ్రహ్మం, ఐద్వా పట్టణ కార్యదర్శి జి.ఉమశ్రీ, జై భీమ్‌ భారత్‌ పార్టీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి జె.విజరు కుమార్‌, ఏఐటీయుసీ నాయకులు ఇర్మియా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మూర్తి, కౌలు రైతు సంఘం క్రోసూరు మండల కార్యదర్శి టి.హనుమంతరావు మాట్లాడారు. పంటలకు మద్దతు ధరల చట్టం చేయాలని, లేబర్‌ కోడ్‌లను రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎం.నరసింహారావు, ఆర్‌.పూర్ణచంద్రరావు, సూరిబాబు, కె.నాగేశ్వరరావు, కె.శివ, ఆర్‌.పురుషోత్తం, జి.రజిని, సిహెచ్‌ నాగమల్లేశ్వరరావు, ఇ.లింగయ్య, జె.రాజకుమార్‌, షేక్‌ సాయిబాబా, షేక్‌ మస్తాన్‌వలి, డి.వెంకటేష్‌ పాల్గొన్నారు.

➡️