సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త సమ్మె మంగళవారం 21వ రోజుకు చేరింది. స్థానిక కలెక్టరేట్‌ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు అనకాపల్లి జిల్లాకు చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగి వాసుదేవ్‌ మతి బాధాకరమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఎర్‌ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. విద్యాశాఖలో కీలకపాత్ర పోషిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సిఎం జగన్‌ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తాననే వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమగ్రశిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలన్నారు. ఉద్యోగులకు పిఆర్‌సి అమలు చేయకుండా నెలల తరబడి వేతనాలు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం ఆపేది లేదని తెలి పారు. తక్షణం సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష జెఎసి నాయకులు పాల్గొన్నారు.

➡️