సమగ్ర శిక్ష ఉద్యోగుల ‘ఆవేదన దీక్ష’

సమగ్ర శిక్ష ఉద్యోగుల 'ఆవేదన దీక్ష'

ప్రజాశక్తి – రాజమహేంద్రవరంసమగ్ర శిక్ష ఉద్యోగులు డిఇఒ కార్యాలయం వద్ద శనివారం ఆవేదన దీక్ష నిర్వహించారు. తమను విద్యాశాఖలోకి విలీనం చేసి, వెంటనే రెగ్యులర్‌ చేయాలని, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని కాంట్రాక్ట్‌ పద్ధతిలోకి మార్చి మినిమం టైమ్‌ స్కేల్‌ అమలు చేసి, వేతనాలు పెంచాలని, ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో 19 మండలాల నుంచి సుమారు 300 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. విద్యాశాఖ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరి కోటగుమ్మం సెంటర్‌లో వైఎస్‌.రాజశేఖరరెడ్డి, గోకవరం బస్టాండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలను అందించారు. కోటగుమ్మం సెంటర్‌ నుంచి పుష్కర్‌ఘాట్‌, మున్సిపల్‌ కార్యాలయం, గోకవరం బస్టాండ్‌, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం మీదుగా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నినాదాలు చేశారు. జెఎసి నాయకుడు ఎం.రఘునాథ్‌, డివి.కృష్ణంరాజు, ఎ.వెంకట్‌, ఎం.మిరపరాజు, ఆర్‌.వెంకట్రావు, కె.చంద్రకుమార్‌, ఎ.వీరపండు, జి.బాలకృష్ణ ప్రసాద్‌ పాల్గొన్నారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన దీక్షల్లో ఉన్న అంగన్వాడీలకు ఉద్యోగులు మద్దతు తెలిపారు. ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.రవిబాబు నగర శాఖ అధ్యక్షుడు గోపి అప్పారావు, కోశాధికారి ఎస్‌.తేజ, విజరు కుమార్‌ సందర్శించారు. వారికి మద్దతు తెలిపారు. రవిబాబు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైమ్‌ స్కేల్‌ ఇవ్వాలని, ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు యుటిఎఫ్‌ అండగా ఉంటుందని చెప్పారు. యుటిఎఫ్‌ తరపున రూ.35 వేలను విరాళంగా అందజేశారు. డి.సుహాసిని, బాల బాలాజీ పాల్గొన్నారు.

➡️