సమగ్ర శిక్ష ఉద్యోగుల పోస్టుకార్డు ఉద్యమం

Jan 1,2024 19:37

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సమ్మె సోమవారానికి 12వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా పోస్ట్‌ కార్డు లు ముఖ్యమంత్రికి రాసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు మాట్లాడుతూ తమతో మంత్రి బొత్స చర్చలు జరిపి ఎటువంటి పరిష్కారం చూపకుండా సమ్మెను విరమించాలని కోరడం సరికాదని అన్నారు. తాము ప్రభుత్వాన్ని కొత్తగా ఏమీ అడగలేదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం తమ వేతనాలు, రెగ్యులరైజేషన్‌ గురించి స్పష్టమైన హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించేది లేదన్నారు. అనంతరం పోస్టు కార్డులను తపాలా బాక్స్‌లో వేసి సిఎంకి పంపించారు. కార్యక్రమంలో జెఎసి జిల్లా అధ్యక్షుడు గురువులు, కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️