సమగ్ర శిక్ష ఉద్యోగుల ర్యాలీ, రాస్తారోకో

Dec 22,2023 21:23

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరిచి సమగ్ర శిక్ష ఉద్యోగులను మోసం చేశారని, హామీలు అమలు చేయకపోతే చంద్ర బాబుకి గత ఎన్నికల్లో పట్టిన గతే జగన్‌ కు తప్పదని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన. వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి ఆర్‌అండ్‌బి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెలా 1వ తేదీకి వేతనాలు చెల్లించాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు మంజూరు చేయాలని, గ్రాడ్యుటీ మరియు 20లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమ్మెకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు, నాయకులు తిరుపతి నాయుడు మద్దతు తెలిపారు. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ సమ్మె విరమించబోమని సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు స్పష్టం చేశారు.

➡️