సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్సీల మద్దతు

Dec 26,2023 21:40

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సిఎం జగన్‌ ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి సమ్మె 7వ రోజుకు చేరుకుంది. కలెక్టరేట్‌ ఎదుట నిరసనలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పోరాటానికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు పాకలపాటి రఘు వర్మ, వేపాడ చిరంజీవి మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మొండిగా వెళ్లకుండా వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు మాట్లాడుతూ జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. యంటియస్‌ అమలు చేసివేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెలా 1వ తేదీకి వేతనాలు చెల్లించి, వార్షిక బడ్జెట్‌ ఒకేసారి విడుదల చేయాలని కోరాఉ. రగ్యులైజేషన్‌, వేతనాల పెంపు, తక్షణమే బకాయిల చెల్లింపు తదితర సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి గురువులు ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️