సమగ్ర శిక్ష ఎస్‌పిడి వైఖరి మార్చుకోవాలి

గుంటూరులో చేతులకు సంకెళ్లతో నిరసన తెలుపుతున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను భయపెట్టటానికి సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ షోకాజు నోటీసులు ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గుంటూరు జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జెఎసి జిల్లా గౌరవాధ్యక్షులు బి.లక్ష్మణరావు అన్నారు. తక్షణమే ఎస్‌పిడి చర్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌పిడి చర్యలకు నిరసనగా గురువారం గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. పలు జిల్లాల్లో షోకాజులు ఇచ్చారని, సమ్మె విరమించకపోతే టెర్మినేషన్‌ పేరుతో భయపెట్టాలని చూస్తున్నార్నారు. సమస్యలపై నిరసన తెలియజేసే హక్కు ప్రతీ పౌరుడికీ ఉందని, కానీ ఉద్యోగుల్ని భయపెట్టాలని ఎస్‌పిడి ప్రయత్నించటం అప్రజాస్వామికం అన్నారు. చట్టబద్ధంగా సమ్మెకు 14 రోజుల ముందు సమ్మె నోటీసు ఇచ్చామని, 16 రోజులుగా సమ్మె జరుగుతోందని గుర్తు చేశారు. దాదాపు నెల రోజులపాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా ఉద్యోగుల్ని బెదిరించటం సరికాదన్నారు. ఉద్యోగులు కొత్త కోరికలు కోరట్లేదని, గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రెగ్యులరైజేషన్‌, మెచ్‌ఆర్‌పాలసీ అమలు, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వంటి హామీలను అమలు చేయాలని కోరారు. డిమాండ్లపై స్పందించకపోవటం వల్లే సమ్మెలోకి వెళ్లినట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం నియంతృత్వ ధోరణి మానుకొని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బెదిరించాలని చూస్తే సమ్మె ఉధృతం అవుతుందన్నారు. కార్యక్రమంలో జెఏసీ జిల్లా అధ్యక్షులు ప్రకాష్‌, మహిళా విభాగం అధ్యక్షులు రాధా, సహాయ కార్యదర్శి శివపార్వతి, జ్యోతి, మాధవి, జాఫర్‌, సుభాని, చలపతి పాల్గొన్నారు.

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏంజెల్‌ టాకీస్‌ వద్ద ధర్నా చౌక్‌లో ఏపీ సమగ్ర శిక్ష కాంటాక్ట్‌ అవుట్సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. జేఏసీ పల్నాడు జిల్లా అధ్యక్షులు వెంకట్‌ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే వేతన జీవుల మనుగడ ఎలాగని ప్రశ్నించారు. సమ్మెలో పాల్గొంటున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని, తనిఖీలంటూ ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. సమ్మె విచ్ఛిన్న ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. తమపట్ల విద్యాశాఖ అధికారులకు విశ్వాసం ఉంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఉద్యోగులు ఇదే స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు పి.రామకృష్ణ, పి.సాంబశివరావు, అంజిరెడ్డి, కోటేశ్వరరావు నాయక్‌, శ్రీకాంత్‌, నజీముద్దీన్‌, బక్కయ్య, మస్తాన్‌, వీరాంజి, వై.సుబ్బాయమ్మ, రజిని, మంజూష, స్నేహలత, మమత, అంజమ్మ పాల్గొన్నారు.

➡️