సమన్వయంతో పనిచేయాలి : ఎంపిడిఒ

భీమడోలు : గ్రామాల అభివృద్ధికి, గ్రామ పంచాయతీ స్థాయిలో సమర్థవంతమైన పాలనతో పాటు ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు పంచాయతీ పాలకవర్గం, అధికారులు పరస్పరం సహకరించుకుని సమన్వయంతో పని చేయాలని భీమడోలు ఎంపిడిఒ సిహెచ్‌.పద్మావతి దేవి కోరారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం గ్రామపంచాయతీ సాధారణ పరిపాలన, ఆర్థిక వ్యవహారాల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, సచివాలయాల సిబ్బందికి ఒకరోజు పాటు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న భీమడోలు ఎంపిడిఒ గ్రామపంచాయతీ పరిపాలన విధానంపై, 36 అంశాలపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బంది అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పంచాయతీ పరిపాలన విధానంపై సిద్ధం చేసిన బుక్‌ లెట్లను అధికారులకు అందజేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ విస్తరణాధికారి సుందరి పాల్గొన్నారు.

ముదినేపల్లి : జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు శనివారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయతీ పరిపాలనా విధానంపై, పంచాయతీ సాధారణ పరిపాలన విధానం గురించి ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్‌ (1-6)లకు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపిడిఒ పి.మల్లేశ్వరి ప్రారంభించారు. ఈ శిక్షణా సమావేశంలో పరిపాలనాధికారి రమణబాబు పాల్గొన్నారు.

➡️