సమస్యలపై అంగన్‌వాడీల సమరం

మండపేటలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మెలో పాల్గొన్న కృష్ణవేణి

తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు మంగళవారం నుంచి సమ్మెను ప్రారంభించారు. సమ్మెలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొని తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. సమ్మెకు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

ప్రజాశక్తి-యంత్రాంగం

అమలాపురం ఐసిడిఎస్‌ ఆఫీసు వద్ద మంగళవారం అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్స్‌, మినీ వర్కర్స్‌ సమ్మె దీక్ష శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మె చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. అంగన్‌వాడీ సమస్యలపై పలుమార్లు నిరసన కార్యక్రమాలు, చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారన్నారు. 76 గంటల దీక్ష చేశారన్నారు.. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం జరిగిన చర్చలు విఫలం అవడంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నారన్నారు. సెంటర్లకు తాళాలు వేసి ప్రాజెక్టు పరిధిలో దీక్ష శిబిరాలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరి పోరాటానికి ప్రజాసంఘాలుగా మేము మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. తక్షణం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గాప్రసాద్‌ హాజరై మద్దతుని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు కె.బేబీగంగారత్నం, ఎం.విజయ, జిల్లా ట్రెజరర్‌ పి.అమూల్య, ప్రాజెక్ట్‌ నాయకులు రత్నకుమారి, రుక్మిణి, విజయ, జి.దైవకృప తదితరులు నాయకత్వం వహించారు. అంగన్‌వాడీలు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచంద్రపురం అపరిష్కృతంగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్ల సమస్యల పరిష్కరించాలంటూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో అంగన్‌వాడీ వర్కర్లు హెల్పర్లు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రామచంద్రపురం మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా టెంట్లు వేసుకుని రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి లోకల్‌ బలరాం మాట్లాడుతూ ఎప్పటినుంచో పరిష్కారం కానీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నియోజకవర్గం లోని సుమారు 500 మంది అంగన్వాడి వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారని వివరించారు. కార్యదర్శి కె.కృష్ణ వేణి మాట్లాడుతూ ప్రభుత్వం చర్చల పేరుతో 11న యూనియన్స్‌ సభ్యులను పిలిచి చివరికి మొండి చెయ్యి చూపించారని ఈనెల 8 నుండి చేయాల్సిన రిలే నిరాహార దీక్షలను తుపాను కారణంగా వాయిదా వేయడం జరిగిందని తుపాను ప్రాంతాల్లో బాధితులకు అంగన్‌వాడీ సెంటర్లలో భోజనాలు వండి పెట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని లేకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేసి కలెక్టరేట్లను ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. ముమ్మిడివరం సమ్మెకు సిఐటియు జన విజ్ఞాన వేదిక మద్దతు తెలిపాయి. అంగన్‌ వాడీల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని సిఐటియు, జన విజ్ఞాన వేదిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో మంగళ వారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా ముమ్మిడివరం ప్రాజెక్టు కార్యాలయం అవరణ లో ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు ఎస్‌.దుర్గా మహేశ్వరి ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెను యు టి ఎఫ్‌ సీనియర్‌ నాయకుడు, జెజెవి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెవివి సత్యనారాయణ ప్రారంభించారు సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గా ప్రసాద్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు పాము బాలయ్య మాట్లాడారు. సమ్మె ప్రాంగణాన్ని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు జనిపల్లి సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు జగడం నాగేశ్వర రావు సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎం.జయలక్ష్మి, మాజీ కార్యదర్శి కె.వెంకట లక్ష్మి, మంగాయామ్మ, శ్రీదేవి, బేబీ రాణి, విజయ సుబ్బలక్ష్మి, అంజనీ దేవి, జి.విజయ ధనలక్ష్మి, తలుపులమ్మ సత్యవతి, అనంత రమాదేవి లతో పాటు సుమారు 500 మంది అంగన్‌ వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు. మండపేట స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం చేపట్టిన సమ్మెను అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణవేణి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానన్న సిఎం జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలన్నారు. సమ్మెకు ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు, హోమియో వైద్యులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ చల్లా రవికుమార్‌, యుటిఎఫ్‌, సి ఐ టి యు నాయకులు సురేంద్ర కుమార్‌, బలరాం తదితరులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మండపేట ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.బేబి, ఆదిలక్ష్మి, సిహెచ్‌.రాణి, మంగాదేవి, జానకి, అనంత, దేవకి, దుర్గా, వజ్రం, కుమారి, నాగలక్ష్మి, కమల తదితరులు పాల్గొన్నారు.

 

➡️