సమస్యలు పరిష్కరించకుంటే ప్రత్యక్ష ఆందోళన

Dec 29,2023 22:54
అంగన్‌వాడీలు, ఎస్‌ఎస్‌ఎ,

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

అంగన్‌వాడీలు, ఎస్‌ఎస్‌ఎ, మున్సిపల్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే తాము సైతం ప్రత్యక్ష ఆందోళనలో భాగస్వాములం అవుతామనిసిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు నేతల హెచ్చరించారు. నగరం లోని శ్యామలా సెంటర్లో శుక్రవారం అంగన్‌వాడీలు, సమగ్ర శిక్ష ఉద్యోగులు, మున్సిపల్‌ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు కార్మిక సంఘాల ఆధ్వ ర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సుందర బాబు, బి.రాజులోవ, ఎఐటియుసి జిల్లా కన్వీనర్‌ కె.రాంబాబు, ఐఎఫ్‌టియు జిల్లా ఉపాధ్యక్షులు కె.జోజి మాట్లాడారు. గత 18 రోజులుగా అంగన్‌వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ఏమీ తెలియనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు పక్క రాష్ట్రం కంటే అదనంగా జీతాలు ఇస్తానని చెప్పి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించడం జగన్మోహన్‌ రెడ్డికి తగద న్నారు. నాడు అంగన్‌వాడీలను అక్కా చెల్లెమ్మలంటూ పలుకరించిన జగన్‌ నేడు వారిని శుత్రువులుగా చూస్తున్నారని మండి పడ్డారు. శాంతి యు తంగా సమ్మె చేస్తు న్న అంగన్‌వాడీలను మరింతగా రెచ్చగొట్టేలా సెంటర్ల తాళాలను పగలగొట్టించి ప్రభు త్వమే అలజడిని సృష్టించేలా చేసిందన్నారు. ఇటువంటి దిక్కు మాలిన చర్యలు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మాత్రమే చేసిందని, గతంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. రాష్ట్రంలో 25 వేల మంది ఎస్‌ఎస్‌సి ఉద్యోగులు, సుమారు 40 వేల మంది మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సమ్మె చేస్తుంటే ఉలుకు పలుకు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శంచారు. ఇదే తీరుతో ప్రభుత్వం ముందుకు వెళ్లితే రాబోయే ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యాక్షులు ఎస్‌ఎస్‌ మూర్తి, జిల్లా కోశాధికారి కెఎస్‌వి రామచంద్రరావు, ఆయా యూనియన్ల నాయకులు సప్పరమణ, సిహెచ్‌.మోహన్‌ రావు, కొండలరావు, బి. పవన్‌, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌. మాణిక్యాంబ, కర్రి.రామకృష్ణ, సోమేశ్వరరావు పాల్గొన్నారు. .

➡️