సమస్యల పరిష్కరించాలని టిఎలు వినతి

Mar 4,2024 21:39

ప్రజాశక్తి – సీతానగరం: మండలంలోని ఉపాధిహామీ చట్టం కార్యాలయంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని సోమవారం స్థానిక ఎంపిడిఒ ఈశ్వరరావుకు వినతిని అందజేశారు. అనంతరం సాంకేతిక సహాయకులు కూర్మారావు, ఇసి కృష్ణ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు, పిఆర్‌సిలు పెంచుతామని హామీలిచ్చినా నేటికీ ఆ హామీని నిలబెట్టుకోవడంలేదన్నారు. తక్షణమే ఆ హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టెక్నికల్‌ అసిస్టెంట్లు లక్ష్మణ్‌, శ్రీదేవి, జానకి, శ్రీను వాసరావు పాల్గొన్నారు.కురుపాం : ఉపాధి హామీ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నల్ల బ్యాడ్జీలతో స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఎంపిడిఒ ఎస్‌.అప్పారావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు తెలుసుకుని అన్ని శాఖలతోనే రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అలాగే జీతాలు పెంపు కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా కనీస స్పందన చూపలేదని అన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ఎఫ్‌టిఇలుగా గుర్తించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలతో విధులకు అయ్యామని అన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది ఎస్‌.సురేష్‌ కుమార్‌, కె.సరళ, ఎం.విశ్వం, ఆర్‌.లక్ష్మి,రమేష్‌, టి.ధనుంజయ, తేజవతి తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం: ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న సిఒ అండ్‌ ఎఎ టెక్నికల్‌ సహాయకులుగా విధులు నిర్వహిస్తూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎంపిడిఒ ఎంవిబి సుబ్రహ్మణ్యంకు సమ్మె నోటీసు అందజేశారు. పదేళ్ల నుంచి తమకు అన్యాయం జరుగుతుందని, డిపిఒ గ్రేడ్స్‌లో ఫిక్స్‌ చేసి న్యాయం చేయమని ప్రభుత్వానికి, అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని నాయకులు తెలిపారు. సమ్మె నోటీస్‌ ఇచ్చిన వారిలో ఎపిఒ జి.సత్యంనాయుడు, సిఒ, ఎఎ, టెక్నికల్‌ సహాయకులు ఉన్నారు.

➡️