సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు

Dec 12,2023 16:10 #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : అపరిస్కతంగా ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కరించాలంటూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రామచంద్రపురం మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా టెంట్లు వేసుకుని రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ కంటే అధికంగా వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్మానాల అమలు చేయాలని రిటైర్మెంట్‌ బెన్ఫిట్‌ 3లక్షలు ఇవ్వాలని నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి లోకల్‌ బలరాం మాట్లాడుతూ ఎప్పటినుంచో పరిష్కారం కానీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నియోజకవర్గం లోని సుమారు 500 మంది అంగన్వాడి వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కంటే వెయ్యి రూపాయల అధికంగా ఇస్తామని ప్రకటించి నేటికీ అమలు చేయటం లేదని ఆయన వివరించారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగుతుందన్నారు. కార్యదర్శి కే.కృష్ణ వేణి మాట్లాడుతూ ప్రభుత్వం చర్చల పేరుతో 11వ తేదీన యూనియన్స్‌ సభ్యులను పిలిచి చివరికి మొండి చెయ్యి చూపించారని ఈనెల 8 నుండి చేయాల్సిన రిలే నిరాహార దీక్షలను తుపాను కారణంగా వాయిదా వేయడం జరిగిందని. తుఫాను ప్రాంతాల్లో బాధితులకు అంగన్వాడీ సెంటర్లలో భోజనాలు వండి పెట్టమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని లేకుంటే ఉద్యమం మరింత ఉధతం చేసి కలెక్టరేట్లను ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. సుమారు 500 మంది అంగన్వాడీ వర్కర్లు,ఆయాలు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు.

➡️