సమస్యల పరిష్కారానికి ఉధృత పోరాటం

Mar 21,2024 20:38

 ప్రజాశక్తి-నెల్లిమర్ల  : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ తెలిపారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసన గురువారినికి 51వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టివి రమణ మాట్లాడుతూ గత 51రోజులుగా మిమ్స్‌ ఉద్యోగులు 7 డిఎ బకాయిలు ఇవ్వాలని, వేతన ఒప్పందం చేయాలని, వేధింపులు, కక్ష పూరిత బదిలీలు నిలిపివేసి, సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ యంత్రాంగం కూడా కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న మిమ్స్‌ యాజమాన్యానికి వత్తాసు పలకడం భావ్యం కాదన్నారు. ఎంతటి పోరాటానికైనా మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు సిద్ధంగా ఉన్నారని, బెదిరింపులు, ప్రలోభాలకు లొంగే ప్రసక్తి లేదని అన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలని కోరారు. చర్చలు విఫలమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మిమ్స్‌ యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, జిల్లా కమిటీ సభ్యులు కిల్లంపల్లి రామారావు, ఉద్యోగులు మిరప నారాయణ, కర్రోతు కాము నాయుడు, కొమ్మూరి మధు, మహంతి నాగ భూషణం, బెల్లాన బంగారు నాయుడు, గౌరి,మూర్తి, మహంతి రాంబాబు, అప్పల నాయుడు, వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

➡️