సమ్మె ఒప్పంద జీవోలు వెంటనే ఇవ్వాలి

Feb 6,2024 21:17

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద జీవోలను వెంటనే విడుదల చేయాలని, పంపు హౌస్‌ కార్మికుల్ని ఆప్కాస్‌ లో చేర్చాలని, ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్‌రావు మాట్లాడుతూ 16 రోజుల సమ్మె సందర్భంగా గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ రాతపూర్వకంగా ఇచ్చిన హామీలకు జీవోలు ఇవ్వకుండా కాలయాపన చేయడం తగదని అన్నారు. క్లీన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ వర్కర్స్‌కు రూ.21వేలు, డ్రైవర్లకు రూ.24వేలు జీతం పెంపు జీవోలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంజనీరింగ్‌, పంప్‌ హౌస్‌, క్లాప్‌ వాహన డ్రైవర్లు, ప్లాంటేషన్‌ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలన్నారు. జీవో నెంబర్‌ 30 సవరించి స్కిల్డ్‌ , సెమి స్కిల్డ్‌ వేతనాలు అమలు చేయాలని, పంపు హౌస్‌, ప్లాంటేషన్‌ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలని, పారిశుధ్య కార్మికులకు 2 నెలల హెల్త్‌ అలవెన్స్‌ లు, జీవో నెంబర్‌ 7 ప్రకారం క్లాప్‌ డ్రైవర్లకు, సూపర్‌వైజర్లకు రూ. 18500 జీతం , సబ్బులు, నూనెలు, చెప్పులు, బట్టలు, బ్లౌజులు తదితర రక్షణ పరికరాలు, పనిముట్లు, సరెండర్‌ లీవ్‌ డబ్బులు చెల్లించాలని ,జిపిఎస్‌ అకౌంట్లు తెరవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సిఐటియు నగర కార్యదర్శి ,బి. రమణ, నాయకులు బాబురావు ,లక్ష్మి, సంతోషం, పైడ్రాజు, గౌరీ ,వెంకటమ్మ, ప్రశాంత్‌, చిన్న సూరి, బాబురావు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

➡️