సమ్మె విరమించం..సత్తా చూపిస్తాం

ప్రజాశక్తి – మైదుకూరు సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మెను విరమించమని తమ సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని అంగన్వాడీలు అన్నారు. మైదుకూరు, దువ్వూరు ప్రాజెక్ట్‌ పరిధిలలో వెయ్యి మంది అంగన్వాడీలు 38 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కనీసం ఒక్కసారైనా అంగన్వాడీల మొర ఆలకించడానికి రాకపోవడానికి నిరసిస్తూ మా ఎమ్మెల్యే ఎక్కడున్నాడో ఆచూకీ చూపాలంటూ మైదుకూరు అర్బన్‌ సిఐకి గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి జి.శివకుమార్‌, ఎఐటియుసి నియోజకవర్గం నాయకులు శ్రీరాములు, శివరామ్‌, యూనియన్‌ నాయకులు ధనలక్ష్మి, భారతి, చెన్నమ్మ, లక్ష్మి, అనురాధ, మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తమ డిమాండ్ల కోసం అత్యంత న్యాయబద్ధంగా అంగన్వాడీలు సమ్మె నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇన్ని రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న మైదుకూరు ఎమ్మెల్యే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని తమ దగ్గరికి వచ్చి తమ కష్టాలను వినే పరిస్థితి కూడా లేదని ఎమ్మెల్యే ఇంటికి స్వయంగా అంగన్వాడీలు వెళితే కనీసం అటు వైపు కూడా రాలేదని పోలీసుల ద్వార అక్కడి నుండి పంపించి వేశారని, 38 రోజులుగా పదుల సార్లు మైదుకూరుకు వచ్చిన ఎమ్మెల్యేకి అంగన్వాడీల ఆక్రందన వినిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇంతమంది మహిళలు ప్రతిరోజు రోడ్డు మీదికి వచ్చి ఆందోళన చేస్తుంటే కనీసం పరామర్శించడానికి కూడా ఎమ్మెల్యే రాకపోవడం దురదష్టకరమని పేర్కొన్నారు. 38 రోజులుగా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆయన ఎక్కడున్నాడో ఆచూకీ చూపాలంటు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్షలకు 15 మంది యూనియన్‌ రాష్ట్ర నాయకులు సిద్ధపడ్డారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచే నిర్ణయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీక్షల్లో కూర్చున్న వారికి ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గురవయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాయప్పా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహయ కార్యదర్షి అజరు కుమార్‌, రాజ, రమాదేవి, రామతులసి, అంజనాదేవి, మంజుల, అన్నపూర్ణపాల్గొన్నారు. పోరుమామిళ్ల : పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం నుండి సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వమిచ్చిన షోకాజ్‌ నోటీసుకు బదులుగా రెండవరోజు జవాబుదారితనంగా సమాధాన నోటీసు సిడిపిఒకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌.భైరవప్రసాద్‌ మాట్లాడుతూ పోరుమామిళ్ల ప్రాజెక్టులో 315 మంది అంగన్వాడి టీచర్లు మినీ అంగన్వాడి టీచర్లు, ఆయాలు ఉన్నారని వారందరికీ ప్రభుత్వం నుంచి షోకాజ్‌ నోటీసులు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు మేరి, వినోదాదేవి, పోరుమామిళ్ల మండల నాయకులు దస్తగిరిమ్మ, జ్యోతిమ్మ, రేణుక, సుదా, స్వాతి రమాదేవి శ్రీదేవి, అంగన్వాడీలు పాల్గొన్నారు. కడప అర్బన్‌ : ప్రభుత్వం వేతనాల పెంపు హామీ వద్దు జీవో కావాలని అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా, నగర ప్రధాన కార్యదర్శి బి. లక్ష్మీదేవి, ఎం.పి. అంజనీ దేవి డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన 38వ రోజు అంగన్వాడీ సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా అంజనీ దేవి మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీలకు జూలైలో వేతనాలు పెంచుతామని, విధులోకి చేరాలని ప్రకటన చేశారని మాకు హామీ వద్దు జిఒ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే మేము విధులోకి వస్తామని పేర్కొన్నారు. సంక్రాంతి పండగ సైతం అంగన్వాడీలు రోడ్డుపైన పస్తులతో చేస్తుంటే ముఖ్యమంత్రి కోట్ల రూపాయలు ఖర్చు చేసి పండగ జరుపుకున్నారని పేర్కొన్నారు. కనీసం మా గురించి ఒక్క క్షణమైనా ఆలోచన చేస్తే తీరిక లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక సభలో రాజకీయ నాయకుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాలరు పట్టుకుని అడిగే రోజులు రావాలని చెప్పిన మాటలు గుర్తుకు లేవా అని మండిపడ్డారు. అంగన్వాడీలపై ప్రభుత్వం మొండి వైఖరి వీడి పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️