సమ్మె హామీలను అమలు చేయాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు, జిఒలు అమలు చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్‌ చేశారు. ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో అంగన్‌వాడీ సమావేశం నిర్వహించారు. సమ్మె కాలంలో జిఒ, పలు సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించి నిరాహార దీక్షకు కూర్చుని మొదటి సారి జిల్లాకు వచ్చిన సుబ్బరావమ్మకు అంగన్‌వాడీలు పూలబొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీల సమ్మెకు సిఐటియు, అన్ని సంఘాల మద్దతు లభించిందని పేర్కొన్నారు. 42 రోజుల పాటు సమ్మె నిర్వహించి ప్రభుత్వ నిరంకుశ చర్యలను అడ్డుకున్నామని చెప్పారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మొండిగా వ్యవహరిస్తే అంగన్‌వాడీలు జగమొండిగా వ్యవహరించి కొన్ని హామీలను సాధించుకున్నారని తెలిపారు. ఎస్మా ప్రయోగించిన తరువాత అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించామని తెలిపారు. చలో విజయవాడకు పిలునిచ్చామన్నారు. సిఎం జగన్‌ పోలీసుల చేత అడ్డుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. లక్ష మంది అంగన్‌వాడీలు వీధుల్లోకి వచ్చి సమ్మె చేశారని చెప్పారు. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదని తెలిపారు. అంగన్‌వాడీల సమ్మె ఒక చారిత్రాత్మకం అన్నారు. సమ్మె కాలంలో కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎల్‌సి సాబ్జి ఇదే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారని తెలిపారు. విజయవాడలో ధర్నాకు పిలుపుస్తే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. సమ్మె సందర్భంగా అనేక హామీలను సాధించుకున్నామని పేర్కొన్నారు. జులైలో ఎంత వేతనం పెంచుతారన్నది వేచి చూడాలని తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 16న నిర్వహించే గ్రామీణ బంద్‌లో అంగన్‌వాడీలు భాగస్వామలు కావాలని కోరారు. సెంటర్లను నడుపుతూ 2,3 గంటలు పాల్గొనాలని పేర్కొన్నారు. సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మిదేవి, బి.లక్ష్మిదేవి, అర్బన్‌ ప్రాజెక్టు కార్యదర్శి అంజనీదేవి, అంగన్‌వాడీలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️