సరిహద్దుల చెక్‌పోస్ట్‌ల వద్ద పకడ్బందీగా తనిఖీలు

Mar 21,2024 21:49

సమావేశంలో మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సరిహద్దుల్లో ఉన్న చెక్‌ పోస్టుల వద్ద నిఘా పకడ్బందిగా నిర్వహించాలని, తనిఖీలు విస్తృతం చేయాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఆదేశించారు. జిల్లా పరిధిలోని రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు చేయాల్సిన విధానాలపై సంబంధిత అధికారులతో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టరేట్‌లో గురువారం సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇంటిగ్రేటేడ్‌ చెక్‌ పోస్టులు-3, సరిహద్దు చెక్‌ పోస్టులు-6, ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ చెక్‌ పోస్టులు-16 ఉన్నాయన్నారు. ఆయా చెక్‌ పోస్టులలో అవసరమైన సిబ్బందిని త్వరితగతిన నియమించాలని ఆదేశించారు. చెక్‌ పోస్టుల వద్ద తనిఖీలో స్వాధీనం చేసుకున్న సామగ్రి, నగదు ఇతర వస్తువులను స్ట్రాంగ్‌ రూముల్లో భద్ర పరచాలని, ఎన్నికల అనంతరం విచారణ జరిపి తిరిగి అందజేయాలని చెప్పారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️