సరైన అనుమతుల్లేకుండా పోస్టర్లు, బ్యానర్లు పెడితే కేసులు

Mar 19,2024 23:56

ఎంసిసి అధికారులు, సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్‌ కీర్తి
ప్రజాశక్తి-గుంటూరు :
ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా తొలగించిన రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు సరైన అనుమతులు లేకుండా తిరిగి ఏర్పాటు చేస్తే పోలీసు కేసులు నమోదు చేయాలని మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసిసి) అధికారులకు నగర కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఆర్‌ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్‌ స్థానిక నగరంపాలెం, కన్నావారితోట, రైలుపేట, నాజ్‌సెంటర్‌, కొత్తపేట, వసంతరాయపురం, శారదాకాలనీ, సంజీవయ్యనగర్‌, నెహ్రు నగర్‌లోని పలు ప్రాంతాల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలును పరిశీలించారు. ఎన్నికల కోడ్‌ మేరకు నగరంలోని ప్రభుత్వ ఆస్తులపై ఉన్న వాల్‌రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలను, బహిరంగ ప్రదేశాలు, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్‌ స్తంభాలు, మున్సిపల్‌ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయపరమైన అడ్వర్టైజ్‌మెంట్లు, వాల్‌ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు అన్నింటినీ తొలగిస్తున్నట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో తొలగించిన వాటిని సరైన అనుమతి తీసుకోకుండా కొందరు తిరిగి ఏర్పాటు చేస్తున్నారని, అటువంటి వారిపై వెంటనే పోలీసు కేసులు నమోదు చేయాలని ఏఆర్‌ఓలను ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా ఎంసిసి ఉల్లంఘనలను ప్రజలు గుర్తిస్తే జిఎంసి ప్రధాన కార్యాలయంలోని కంప్లైంట్‌ సెల్‌కు ఫోన్‌ చేసి చెప్పొచ్చని, లేదా వివరాలను 9849908391కు వాట్సాప్‌ ద్వారా పంపితే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యటనలో ఏఆర్‌ఓ సునీల్‌, ఎంసిసి టీం అధికారి అనుపమ, సిబ్బంది పాల్గొన్నారు.
పార్టీల ఫిర్యాదుల్ని సత్వరమే పరిష్కరించాలి
గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నాయకుల నుండి అందిన ఫిర్యాదులు, ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని నగర కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ ఆర్‌ఓ కీర్తి చేకూరి చెప్పారు. మంగళవారం కమిషనర్‌ చాంబర్‌లో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితాపై అందిన ఆర్జీల పరిష్కారంపై పశ్చిమ నియోజకవర్గ ఆర్‌ఓ, అదనపు కమిషనర్‌ కె.రాజ్యలక్ష్మీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాపై ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిదుల నుండి అందిన అర్జీలు, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలన్నారు. ఎన్నికల కోడ్‌ను క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలు చేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. పార్టీ కార్యాలయాలు, అభ్యర్థుల కార్యాలయాల వద్ద ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ప్రకటనల బోర్డులు, జెండాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ నెల 11 నుండి 18 వరకు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఫారం 6, 7, 8లు, షిఫ్టింగ్‌ దరఖాస్తులు 3,529 అందాయని వాటిని రెండ్రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించామని చెప్పారు. సమావేశంలో ఏఈఆర్‌ఓలు వెంకట లక్ష్మీ, సునీల్‌, సూపరిండెంట్లు ప్రసాద్‌, పద్మ, సెక్టోరల్‌ అధికారి శ్రీధర్‌, వైసిపి నుండి డి.జానిబాబు, టిడిపి నుండి ఓంకార్‌, బీఎస్పీ నుండి సిహెచ్‌.వాసు, ఆప్‌ నుండి డాక్టర్‌ సేవాకుమార్‌, కాంగ్రెస్‌ నుండి జానీబాష, డిప్యూటీ తహసిల్దార్‌ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

➡️