సర్పంచ్‌ల నిరసన దీక్ష

Jan 30,2024 21:08

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : సమస్యలు పరిష్కరించి తమను ఆదుకోవాలని సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు రౌతు స్వామి నాయుడు, పంచాయితీ రాజ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గేదెల.రాజారావు డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ వద్ద సర్పంచ్‌లు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలలోని 3.50 కోట్ల గ్రామీణ ప్రజల సంక్షేమం, అభివద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పంపిన 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయితీలకు ఇవ్వకుండా, చెక్కులపై సర్పంచుల సంతకాలు లేకుండా, వారికి చెప్పకుండా గ్రామ పంచాయతీల సిఎఫ్‌ఎంఎస్‌ అకౌంట్ల నుంచి నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి తమ సొంత అవసరాలకు, పథకాలకు వాడుకుంటున్నదని అన్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లకు వెన్నుపోటు పొడిచినట్లేనని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.8,629.79 కోట్లు తక్షణమే తిరిగి తమ పంచాయతీలకు జమచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రామ వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను గ్రామ పంచాయతీలలో విలీనం చేసి, సర్పంచ్‌ల ఆధ్వర్యంలోనే అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కేవలం రూ.3 వేలుగా ఉన్న సర్పంచ్‌ల- ఎంపిటిసిల గౌరవవేతనాలను రూ.15 వేలకు, ఎంపిపి, జడ్‌పిటిసిలకు రూ.30 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. క్లాప్‌ మిత్రలకు గతంలో మాదిరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీక్షలో సర్పంచుల సంఘం నాయకులు ఈగల సత్యారావు, సర్పంచులు గొట్టాపు అప్పలస్వామి, పిన్నింటి సన్యాసి నాయుడు, ఎల్‌. శ్రీనివాసరావు, రొంగలి సత్యనారాయణ, చందక చిన్నంనాయుడు, పోతల రాజప్పన్న తదితరులు పాల్గొన్నారు.

➡️