సాయుధ దళాల సంక్షేమ నిధికి విరాళాలివ్వండి

Dec 7,2023 21:42

  ప్రజాశక్తి-విజయనగరం  :  సైనికుల త్యాగాల ఫలితంగానే దేశంలో ప్రజలంతా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారని కలెక్టర్‌ నాగలక్ష్మి అన్నారు. వారు ఎండనకా, వాననకా ఎన్నో కష్టాలకోర్చి సరిహద్దుల్లో రాత్రీపగలూ పహారా కాస్తూ, మన దేశాన్ని రక్షిస్తున్నారని కొనియాడారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా, సైనికుల సంక్షేమం కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ వద్ద కలెక్టర్‌ నాగలక్ష్మి గురువారం ప్రారంభించారు. పతాకనిధి జెండాను అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. సైనిక దళాలు చూపించే మొక్కవోని దీక్ష, త్యాగం, దేశభక్తి, సాహసాల పట్ల దేశం ఎల్లప్పుడూ గర్వపడుతోందని పేర్కొన్నారు. సాహసోపేత వీర జవాన్లకు వందనం సమర్పించి, వారి కుటుంబాలకు కాస్తయినా చేదోడుగా నిలిచేందుకు డిసెంబరు 7న సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా సాయుధ దళాల సంక్షేమ నిధికి విరాళాలను సేకరించి, సైనికుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా విరాళాల సేకరణ ప్రారంభిస్తున్నామని, ఎన్‌సిసి కేడెట్లు తమ వద్దకు వచ్చినప్పుడు, ప్రజలు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ కోరారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి కృష్ణారావు మాట్లాడుతూ, సాయుధ దళాల సంక్షేమ నిధికి దాదాపు నెలరోజులపాటు దేశ వ్యాప్తంగా విరాళాలను సేకరించడం జరుగుతుందని చెప్పారు. తమ వద్దకు వచ్చే ఎన్‌సిసి కేడెట్లకు నగదు రూపంలో విరాళాలు ఇవ్వవచ్చునని, లేదా జిల్లా సైనిక సంక్షేమాధికారి, విజయనగరం పేరుమీద చెక్కులను లేదా స్టేట్‌బ్యాంకు ఖాతా నెంబరు 52065221666, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ ఎస్‌బిఐఎన్‌ 0020931లో నేరుగా జమ చేయవచ్చునని సూచించారు. గరివిడి ఫేకర్‌ యాజమాన్యం విరాళంగా ఇచ్చిన రూ.11వేల చెక్కును ఆ సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌.ఎన్‌.మూర్తి ఈ సందర్భంగా కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎం.కృష్ణారావు, ఎన్‌సిసి బాలికల బెటాలియన్‌ నుంచి కెప్టెన్‌ ఎం.సత్యవేణి, లెఫ్టినెంట్‌ ఎం.వరలక్ష్మి, ఇంకా సబ్‌. సి.హుస్సేనయ్య తదితరులతోపాటు సైనిక సంక్షేమ సంఘాల నాయకులు, మాజీ సైనికులు, ఎన్‌సిసి కేడెట్లు పాల్గొన్నారు.

➡️