సిఎస్‌ దృష్టికి రైతుల సమస్యలు

రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సిఎస్‌, జిల్లా కలెక్టర్‌

ప్రజాశక్తి-ఆత్రేయపురం

మిచౌంగ్‌ తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, రైతుల సమస్యలను ఎంఎల్‌ఎ జగ్గిరెడ్డి, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సిఎస్‌ కెఎస్‌.జవహర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.పంటలు, రైతుల సమస్యలను ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపు గురైన పంటలను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కెఎస్‌.జవహర్‌ రెడ్డి శనివారం పరిశీలించారు. ఆయన ముందుగా వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మిచౌంగ్‌ తుపాను కారణంగా అకాల వర్షాల వల్ల కొత్తపేట నియోజకవర్గ రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను స్థానిక ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి ముంపు గురైన విషయాన్ని ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. లొల్ల, మెర్లపాలెం గ్రామాల్లో రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న పంట పొలాల వద్దకు ఆయనను తీసుకొని వెళ్లారు. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను, పంట నష్టం జరిగిన విధానాన్ని, పంట కాలువల ఆధునీకరణలో భాగంగా చేపట్టవలసిన పనులను, పంట నష్టం నమోదు తదితర అంశాలను ప్రధాన కార్యదర్శికి ఎంఎల్‌ఎ జగ్గిరెడ్డి వివరించారు. పంట నష్ట పరిహారం, ఇన్సూరెన్స్‌, రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం తదితర విషయాల్లో చేపట్టిన తక్షణ చర్యల విషయమై జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్‌ ఛైర్పర్సన్‌ సాకా మణికుమారి ప్రసన్నకుమార్‌, ఎంపిపి మార్గాన గంగాధర్‌, జెడ్‌పిటిసి సభ్యురాలు గూడపాటి రమాదేవి, ఆర్‌డిఒ ముక్కంటి, ఎంపిడిఒలు నాతి బుజ్జి, ఉమామహేశ్వరరావులు, తహశీల్దార్‌ కార్యాలయ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, ఉపాధి హామీ వేతనదారులు, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

 

 

➡️