సిహెచ్‌డబ్ల్యులను ఆశా వర్కర్లుగా గుర్తించాలి

Feb 19,2024 21:29

ప్రజాశక్తి -బెలగాం: పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎ పరిధిలో పనిచేస్తున్న 1560 మంది కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్చాలని, రూ.10వేలు వేతనాలు చెల్లించాలి కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కమ్యూనిటీ హెల్త్‌వర్కర్లు స్థానిక ఐటిడిఎ వద్ద సోమవారం మహాధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.ఇందిర, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ ఐటిడిఎల పరిధిలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని, ఆశాలతో సమానంగా10 వేలు వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని, 2018 ఏప్రిల్‌ నుండి 2019 నవంబర్‌ వరకు 974 మంది సిహెచ్‌డబ్ల్యులకుపాత బకాయిలు రూ. 81,81600 తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి అనేకమంది డిఎంహెచ్‌ఒలు, ఎఐటిడిఎ పిఒలు, ఎపిఒలు మారినా తమ సమస్య పరిష్కారం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తింపు కార్డులు, యూనిఫాం లేకపోవడంతో విజయనగరం ఘోసాసుపత్రికి రోగులకు తీసుకెళ్తే తమను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కనీసం 5 రోజులు ఉండాల్సి వస్తుందన్నారు. కనీసం వాష్‌, రెస్ట్‌ రూమ్‌లు కూడా లేవన్నారు. గుర్తింపు కార్డులు, యూనిఫామ్‌ ఇస్తామని చెబుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, అందువల్లే ఈరోజున స్థానిక ఐటిడిఎని ముట్టడించామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలగా స్పందించి కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ సమస్యలను పరిష్కారించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఐటిడిఎ డిప్యూటీ డిఎంహెచ్‌ఒకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్‌ఒ, ఎపిఒ వారి పరిధిలో ఉన్న సమస్య లను వారం రోజుల్లో పరిష్కారం చేస్తామని, మిగతా సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు కోశాధికారి గొర్లి వెంకటరమణ. సిఐటియు నాయకులు బంకురు సూరిబాబు. కొల్లి సాంబ మూర్తి, పలువురు కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ పాల్గొన్నారు సీతంపేట: స్థానిక ఐటిడిఎ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు మహాధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ అమ్మన్నాయుడు మాట్లాడుతూ ఐటిడిఎల పరిధిలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని, ఆశాలతో సమానంగా వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, డిఎలు, యూనిఫాం ఇవ్వాలన్నారు. రూ.10లక్షల గ్రూపు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఐటిడిఎ డిప్యూటి డిఎంహెచ్‌ఒ విజయపార్వతికి, ఎపిఒ రోషి రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ధర్నాలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.సురేష్‌ ఎం.కాంతారావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.లక్ష్మణరావు, ఎన్‌.అప్పన్న కె.భాస్కరరావు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయుకులు ఎస్‌.మాలతి, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయుకులు హైమావతి, ఎస్‌.రమణమ్మ, కళావతి, జ్యోతి, బి.కమల తదితరులు పాల్గొన్నారు.

➡️