సిహెచ్‌డబ్ల్యుల సామూహిక దీక్షలు

Feb 14,2024 21:27

ప్రజాశక్తి-సీతంపేట : సిహెచ్‌డబ్ల్యులను ఆశాలుగా మార్పు చేయాలని, రూ.పది వేలు వేతనం ఇవ్వాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని సీతంపేట ఐటిడిఎ వద్ద కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన సామూహిక దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరాన్ని బుధవారం సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిహెచ్‌డబ్ల్యులు రూ.4వేలు గౌరవ వేతనంతో పనిచేస్తున్నారని తెలిపారు. యూనిఫాం, టిఎ, డిఎలు ఏవీ ఇవ్వడం లేదని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. దీక్షా శిబిరాన్ని ఐఎఫ్‌టియు సీనియర్‌ నాయకులు ఎన్‌.నీలంరాజు సందర్శించి, మద్దతు తెలిపారు. సిఐటియు జిల్లా నాయకులు ఎం.కాంతారావు ఆధ్వర్యాన చేపట్టిన దీక్షల్లో సిహెచ్‌డబ్ల్యులు బి.పార్వతి, ఎం.సోములమ్మ, ఎస్‌.శిరీష, ఎన్‌.రంభ, కె.శ్రీలత, బి.కమల, ఎస్‌.సుమోని, ఎన్‌.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంరూరల్‌ : పార్వతీపురం కలెక్టరేట్‌ ఎదుట సిహెచ్‌డబ్ల్యులు దీక్షలు చేపట్టారు. మూడు రోజులపాటు చేపట్టే దీక్షా శిబిరాన్ని సిఐటియు నాయకులు గొర్లి వెంకటరమణ ప్రారంభించారు. దీక్షా శిబిరం వద్దకు వచ్చిన ఐటిడిఎ ఎపిఒ పి.మురళీధర్‌కు వినతి అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు ఎంత పని చేసినా కూడా కనీస వేతనం అందని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేవారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.సూరిబాబు, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు శ్రీదేవి, మల్లీశ్వరి, రాజేశ్వరి, ప్రమీల, జీవిత, దమయంతి, బేబీ చిన్న తల్లి, పుష్పలత పాల్గొన్నారు.

➡️