సైన్స్‌తోనే సమాజాభివృద్ధి

Feb 27,2024 20:59

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : సమాజాభివృద్ధిలో ప్రతి అడుగూ సైన్స్‌తోనే ముడిపడి ఉంటుందని సీతం ఇంజినీరింగ్‌ కాలేజీ డైరెక్టర్‌ ఎం.శశిభూషణరావు అన్నారు. నేషనల్‌ సైన్స్‌ డేను పురస్కరించుకుని స్థానిక గురజాడ పాఠశాలలో ఈనెల 19న సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించిన విషయం విధితమే. విజేతలకు పాఠశాల ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన చేతులమీదుగా నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోబుల్‌ బహుమతి గ్రహీత సర్‌ సివి రామన్‌ సముద్రపు నీరు నీలిరంగులో ఎందుకు ఉంటుందనే విషయాన్ని చాలా కాలంపాటు పరిశోధించారని, 1928 సంవత్సరం నాటికి అందుకు గల కారణాన్ని కనుగొన్నారని వివరించారు. ఇందుకుగా 1930లో ఆయనకు నోబుల్‌ బహుమతి లభించిందన్నారు. దీన్నిబట్టి కష్టపడి తగిన ఫలితంతో పాటు గుర్తింపు కూడా లభిస్తుందన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాల న్నారు. సివి రామన్‌ పరిశోధనా ఫలితానికి గుర్తింపుగా ఏటా ఫిబ్రవరి 28న సైన్స్‌ దినోత్సవాన్ని జరుపు తున్నారని వివరించారు. పాఠశాల కరస్పాండెంట్‌ ఎం.స్వరూప మాట్లాడుతూ చదువుతోపాటు విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభ, సృజనాత్మకతను వెళికితీసేందుకే ఏటా తమ పాఠశాలలో సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నా మన్నారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు తరగతికి ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మందికి ఒకొక్కరికీ రూ.1000 నగదు బహుమతి, ఎల్‌కెజి నుంచి 9వ తరగతి వరకు ఎంపికైనా విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసినట్టు వివరించారు. హెచ్‌ఎం శేఖర్‌ మాట్లాడుతూ గత పదేళ్లగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో గురజాడ విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారని అన్నారు. ఇటీవల నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో మొత్తం 600మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆయన వివరించారు.

➡️