స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

Dec 8,2023 23:53
విధులను సక్రమంగా

ప్రజాశక్తి – కడియం

గ్రామ స్వపరిపరిపాలనకు కావలసిన నిధులు ఇవ్వకుండా స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. శుక్రవారం కడియంలో ఎంపిపి వెలుగుబట్టి ప్రసాద్‌ ఆధ్వర్యంలో మాజీ జడ్‌పిటిసిలు, మాజీ ఎంపిపిలు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపిటిసి సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ గ్రామ సచివాలయాల నిర్వహణ పట్ల ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్నారు. గ్రామ పంచాయతీలకు సచివాలయాలతో ఏమాత్రం సంబంధం లేదని, ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్‌లను సిఎం జగన్‌ రెడ్డి ఉత్సవ విగ్రహాలుగా చేశారని విమర్శించారు. పంచాయి తీలకు వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వేలాది కోట్ల రూపాయలను పక్కదారి పెట్టించారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసం వల్ల పంచాయితీ వ్యవస్థ నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. సర్పంచ్‌, వార్డుసభ్యులకు తెలియకుండా, పంచాయతీ బోర్డు తీర్మానం లేకుండా పంచాయతీ ఖాతాల నుంచి నిధులు మళ్లించడం ద్వారా స్థానికసంస్థల ప్రతినిధులను ప్రభుత్వం మోసం చేయడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు దోహదం చేసే జల జీవన్‌ మిషన్‌ పథకం నిలిచిపోయిందని తెలిపారు. ఈ ఐదేళ్ల జగన్‌ రెడ్డి పాలనలో గ్రామాల్లో రోడ్డు కాని, కాలువలు కానీ నూతనంగా వేసిన పరిస్థితి లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ అధ్వానంగా మారిపో యిందని అన్నారు. ఆఖరికి పంచాయతీలో బ్లీచింగ్‌ వేయ డానికి కూడా డబ్బులు లేని స్థితిలో పంచాయతీ వ్యవస్థను దిగజార్చిసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి టిడిపి ప్రభుత్వం ఏర్పాటుతోనే పంచాయితీలకు పూర్వవైభవం వస్తుందని అన్నారు. పంచాయితీలకు నిధులతోపాటు, విధులను సక్రమంగా నిర్వర్తించే అవకాశం టిడిపి పాలన లోనే సాధ్యమని, ఇప్పటినుంచే గ్రామాల అభివృద్ధిఫై టిడిపి ప్రణాళికను సిద్ధం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి రఘురామ్‌, రూరల్‌ మండలం టిడిపి అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్‌, నాయకులు ఎం.సత్యనారాయణ, పి.రామారావు చౌదరి, ఎం.సత్యవతి, జి.సత్యనారాయణ, వి.నాగబాబు, కృపారావు పాల్గొన్నారు.

➡️