‘స్వర్ణముఖి’ ..అదే గతి

Nov 29,2023 21:28
రెండేళ్ల క్రితం కూలిన స్వర్ణముఖి నదిపై వంతెన

‘స్వర్ణముఖి’ ..అదే గతివంతెన కూలి రెండేళ్లుపట్టించుకోని పాలకులువాహన చోదకుల ఇక్కట్లుప్రజాశక్తి – రామచంద్రాపురం తిరుపతికి కూతవేటు దూరంలో స్వర్ణముఖి నదిపై వంతెన.. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా కుంగి కూలిపోయింది. అయితే రెండేళ్లయినా పాలకులు పట్టించుకోక పోవడంతో మూడు నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల బాధ వర్ణనాతీతం. ఎపుడూ అభివృద్ధి జపం చేసే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గంలోనిదే ఈ సమస్య. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని చంద్రగిరి నియోజకవర్గానికి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అభివృద్ధి జపం చేస్తూ పాదయాత్రల పేరుతో నియోజకవర్గమంతా కలియ తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి సమస్యల గురించి ఆరా తీస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం భారీ వర్షం సాక్షిగా కూలిన స్వర్ణముఖి నది వంతెన నిర్మాణం గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఎంపిపిగానూ, తుడా ఛైర్మన్‌గానూ, ఎంఎల్‌ఎ అభ్యర్థిగానూ ఉన్నారు. ఆయన అనుకుంటే వంతెన నిర్మాణం నిమిషాల్లో పని. ఈ వంతెన నిర్మాణం గురించి చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. వంతెన కూలిన తరువాత రామచంద్రాపురం, వెదురుకుప్పం, తిరుపతి రూరల్‌ మండలాల ప్రజలు తిరుపతికి వెళ్లేందుకు వీలుగా స్థానికుల సహకారంతో మట్టిరోడ్డును తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆర్‌ అండ్‌ బి అధికారులు ఆ మట్టిరోడ్డుపైనే తారు వేశారు. ఈ రోడ్డు కూడా ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలమయమయ్యింది. ఈ మార్గంలో ఆటోలు, కారులు, టిప్పర్లు, ద్విచక్రవాహనాలలో ప్రయాణించాలంటే ఇక్కట్లు పడుతూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి. ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆర్‌ అండ్‌ బి అధికారులతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి స్వర్ణముఖిపై వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రెండేళ్ల క్రితం కూలిన స్వర్ణముఖి నదిపై వంతెన

➡️