హక్కుల రక్షణకు ఐక్య పోరాటమే మార్గం

Jan 29,2024 20:31

ప్రజాశక్తి-విజయనగరం కోట  : మత స్వేచ్ఛ, సమానత్వపు హక్కు కోసం ఐక్యంగా పోరాడడమే మార్గమని ముస్లిము, మైనార్టీస్‌ నాయకులు అన్నారు. కలెక్టరేట్‌ వద్ద సోమవారం క్రిస్టియన్‌, ముస్లిం, ఎస్‌సి, ఎస్‌టి మైనారిటీస్‌ ఐక్య కలయిక ఘనంగా జరిగింది. ఆలిండియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ జిల్లా అధ్యక్షులు పి. ప్రేమానందం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పలువురు తమ సందేశాలు వినిపించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎపి మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ జవాబ్‌ మహమ్మద్‌ నాసిర్‌ మాట్లాడుతూ ప్రాథమిక హక్కులను కాపాడుకోవడం అందరి బాధ్యతన్నారు. మతం, జాతి, కులం, లింగం భేదము లేకుండా అందరికి సమానత్వపు హక్కును రాజ్యాంగం కల్పించిందని, వాటిని కాపాడుకోవాలని అన్నారు. కాని నేడు దేశంలో ముస్లిం, మైనార్టీలో అభద్రతా భావానికి గురవుతున్నారని తెలిపారు. లౌకిక రాజ్యాన్ని కాపాడు కునేందుకు, మన పిల్లల భవిష్యత్తు కోసం అందరం సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. హైకోర్టు న్యాయవాది, ఆలిండియా ప్రార్ధన విజ్ఞప్తి సమితి అధ్యక్షులు డి.సుధాకర్‌ మాట్లాడుతూ నిజమైన స్వాతంత్య్రం కోసం అందరం కలిసికట్టుగా శ్రమించాలన్నారు. వైసిపి మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సోనియామడి, పలువురు నాయకులు మాట్లాడారు.

➡️