హామీలు అమలయ్యే వరకూ పోరాటం

Jan 4,2024 21:49

ప్రజాశక్తి – పాచిపెంట: అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలివ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అంత వరకూ పోరాటం ఆగదని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంట జ్యోతి అన్నారు. అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన పాచిపెంటలో జరుగుతున్న సమ్మె శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. అంగన్వాడీలకు తెలంగాణా కన్నా అదనంగా జీతాలు పెంచుతామన ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని, మినీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా మార్చాలని, నూతన జాతీయ విద్యా విధానం 2021 రద్దు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.ఇందిర, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు మాట్లాడుతూ ఇచ్చిన హామీల అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రభుత్వం స్పందించే అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ నాయకులు బంగారమ్మ, పైడిరాజు, బేగం, సుగుణమ్మ, సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు పాల్గొన్నారు.సాలూరు : సమ్మెలోని అంగన్వాడీ కార్యకర్తలను, హెల్పర్లను బెదిరించడం మానుకోవాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు పట్టణ నాయకులు బి.రాధ, మండల నాయకురాలు ఎ.నారాయణమ్మ కోరారు. నిరసన శిబిరం వద్ద సిఎం జగన్‌మోహన్‌ రెడ్డికి దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు రాధ, నారాయణమ్మ మాట్లాడుతూ ఈనెల 5నుంచి విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం తగదన్నారు. బెదిరింపులకు భయపడేది లేదని చెప్పారు. తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్యామల వరలక్ష్మి పాల్గొన్నారు.కురుపాం : అంగన్వాడీల సమ్మెకు యుటిఎఫ్‌ అండగా ఉంటుందని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు తోట రమేష్‌ అన్నారు. స్థానిక మండల కేంద్రంలో జరుగుతున్న అంగన్వాడీల సమ్మె శిబిరం వద్దకు ఆయన వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అంగన్వాడీలు సమ్మె ప్రారంభించి 24 రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టైనా లేదన్నారు. అంగన్వాడీల సమ్మెకు యుటిఎఫ్‌ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ల జిల్లా అధ్యక్షులు పి.సరళ కుమారి, ప్రాజెక్ట్‌ కార్యదర్శి జె.సరోజ, సెక్టార్‌ లీడర్లు కురుపాం, జియ్యమ్మవలస మండలాల అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.సీతంపేట : స్థానిక ఐటిడిఎ ఎదుట 24 రోజులు నిరవధిక సమ్మె సందర్భంగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అలాగే ఈనెల 5 నాటికి విధులోకి వెళ్లాని అదేశాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని అంగన్వాడీ ఉద్యోగులు కనీస వేతనాలు పరిష్కారించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శమి, సిఐటియు మండల కార్యదర్శి ఎం.కాంతారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.సీతానగరం : సమస్యల పరిష్కారం కోరుతూ గత 24రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న సమ్మె గురువారం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది కోర్కెలు తీర్చాలని వారంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మోకాళ్లపై నిలబడి అరకొర వేతనాలతో ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గవర వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంట జ్యోతి, నాయకులు వి.రామలక్ష్మి, మండల నాయకులు మడక సత్యవతి, పి.యశోద, వంగపండు లక్ష్మి, కె.శైలజ, మరిశర్ల సునీత, పి.సత్యవతి, రెడ్డి రామలక్ష్మి, ఎం.సునీత, పుణ్యవతి తదితర అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.పాలకొండ : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. అంగన్వాడీ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, అవి పరిష్కారమయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని, ప్రజల మద్దతుతో ఆందోళన తీవ్రతం చేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌ హిమప్రభ, జిల్లా కోశాధికారి బి.అమరవేణి, ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు జి.జెస్సీబాయి, ప్రతినిధులు జి.శారద, ఆర్‌.భవాని, ఎం.శ్యామల, శ్రీదేవి, సుగుణ, లలిత, నిర్మల తదితరులు పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్‌ : శాంతియుతంగా అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెపై నిర్బంధాలు విధించి అధికారులు అడ్డుకోవాలని చూస్తే సమ్మెను వివిధ రూపాల్లో మరింత ఉధృతం చేస్తారని సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ అన్నారు. స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు నాయకులు మర్రాపు అలివేలు, సాలూరు గౌరీమణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు పెంచేంత వరకూ సమ్మె కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో సెక్టార్‌ నాయకులు బి.శాంతి, కె.రాజేశ్వరి, ఎం.గౌరి, బి.సునీత, అధిక సంఖ్యలో వివిధ కేంద్రాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు. కొమరాడ : సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినూత్నరీతిలో రోడ్డుపై వెళ్తున్న వాహనాలను తుడుస్తూ అంగన్‌వాడీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కె.సాంబమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అంగన్వాడీ సిబ్బందిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వారి న్యాయమైన కోర్కెలు తీర్చాలని కోరారు. కార్యక్రమంలో మండలంలోని 141 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేయుచున్న సిబ్బంది పాల్గొన్నారు.అనుచిత వ్యాఖ్యలు చేసిన్న వాలంటీర్‌పై చర్యలు తీసుకోవాలిసాలూరురూరల్‌ : మండలంలోని కురుకూటి సచివాలయ పరిధిలో గల గ్రామ వాలంటీర్‌ లంబయ్య అంగన్వాడీలను కించపర్చేలా అనుచితంగా మాట్లాడుతూ వారు చేస్తున్న ఉద్యమమేటని, వారికి జీతాలే దండగని, సరుకులు అమ్ముకుంటున్నారని, వీరికి చదువు రాదని ఇటువంటి వారికి ప్రభుత్వం ఎందుకు జీతాలు పెంచుతాదని, మీరు చేసే పని ఏమిటని రకరకాల తప్పుడు వార్తలు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ అంగన్వాడీల మనోభావాన్ని దెబ్బతీస్తున్న వాలంటీర్‌ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం కురుకూటి సచివాలయ కార్యదర్శి లక్ష్మణరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ సెక్టార్‌ నాయకులు తిరుపతమ్మ, శశి కళ, పుష్ప, సిపిఎం మండల కార్యదర్శి శ్రీనివాసరావు, పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

➡️