హామీలు అమలు చేయాలి

Jan 19,2024 19:12

 ప్రజాశక్తి-బొబ్బిలి  : అంగన్వాడీలకు ఎన్నికల్లో సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బొబ్బిలిలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. ఐసిడిఎస్‌ను బలోపేతం చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, కనీస వేతనాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని 39రోజులుగా సమ్మె చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోయి సమస్యలను పరిష్కరించకుండా జటిలం చేయడం సరైనది కాదు అన్నారు. తక్షణమే ఎన్నికల హామీలను అమలు చేసి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటం ఉధతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కామేశ్వరి, ఉమాగౌరి, నిర్మల, పద్మ, అంగన్వాడీలు పాల్గొన్నారు.

వేతనం పెంపుదలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి

అంగన్వాడీల దీక్షా శిబిరాన్ని ఎపిటిఎఫ్‌ (257) జిల్లా నాయకులు జెసి రాజు సందర్శించి మద్దతు తెలిపారు. ముందుగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. జెసి రాజు మాట్లాడుతూ వేతన పెంపుదలపై ముఖ్యమంత్రి తక్షణం స్పందించాలని కోరారు. అంగన్వాడీల అందిస్తున్న సేవలు, తల్లులు, గర్భిణులు, పిల్లల భవిష్యత్తు ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని వేతనాన్ని పెంచాలని కోరారు. ఈ సందర్భంగా జెసి రాజు, బంగురు జోగినాయుడు రూ.5000 పోరాట నిధిని విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు శంకరరావు , ఎపిటిఎఫ్‌ ప్రతినిధులు పద్మావతి, విజయలక్ష్మి, అంగన్వాడీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️