హామీలు అమలు చేసేవరకూ…సమ్మె విరమించేది లేదు

Dec 18,2023 23:22
సమ్మె

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి, కొవ్వూరు రూరల్‌
సమస్యలు పరిష్కరించే వరకూ, హామీలు అమలు చేసే వరకూ సమ్మెను విరమించేది లేదని అంగన్‌వాడీలు స్పష్టం చేశారు. అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 7వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, కొవ్వూరులో ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. రాజమహేంద్రవరంలో హైటెక్‌ బస్టాండ్‌ నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద బైటాయించారు. సమస్యలు పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని, యాప్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని, అధికారులు, రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని నినదించారు.ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.బేబిరాణి మాట్లాడారు. తెలంగాణ కంటే అదనంగా జీతాలు చెల్లిస్తానని జగన్‌ ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. ప్రభుత్వ ఉన్నత అధికారులు ఆర్థిక డిమాండ్లు తప్ప అన్నీ పరిష్కరిస్తామనడంలో అర్థం లేదన్నారు. ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు లేకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణాలో ఏర్పడిన నూతన ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్‌కు రూ.18వేలు, ఆయాలకు రూ.13,500 వేతనం పెంచిందన్నారు. ఆంధ్రలో మాత్రం నాలుగున్నర ఏళ్లుగా అధిక ధరలతో సతమతమవుతున్నా అంగన్‌వాడీలకు కనీస వేతనాలు చెల్లించట్లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అంగన్‌వాడీలందరూ సిద్ధపడాలన్నారు. సెంటర్ల అద్దెలు సైతం చెల్లించకుండా తాత్సారం చేస్తుందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2018లో అంగన్‌వాడీలకు చెల్లించే కేంద్ర వాటాలో వేయి రూపాయలు పెంచుతామని ప్రకటించి ఆరేళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా నేటికీ పెంచలేదన్నారు. పైపెచ్చు ఐసిడిఎస్‌ బడ్జెట్‌ను కుదించిందన్నారు. తక్షణం అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లఐదు లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే మిలిటెంట్‌ పోరాటాలకు సిద్ధపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ధర్నాకి సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్‌.మూర్తి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇ.భాస్కర్‌, ఎన్‌.రాజా, ఉపాధ్యక్షులు వి.రాంబాబు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు బి.మార్తమ్మ, అన్నపూర్ణ, భాగ్యలక్ష్మి, సునీత, శారద, మాలతి, సుబ్బలక్ష్మి, ఎం.మార్త, రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.కొవ్వూరు ఆర్‌డిఒ కార్యలయం వద్ద అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మాణిక్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందర్‌ బాబు మాట్లాడారు. ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా గుర్తించి వేతనాలు, ప్రమోషన్లు కల్పించాలన్నారు. ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ రద్దు చేయాలని, కారుణ్యనియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా నాయకులు జువ్వల రాంబాబు, ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ నాయకులు పెనుమాక జయరాజు, దళిత ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు చోళ్ల రాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వల్లేపల్లి నరసింహమూర్తి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కె.భాస్కర్‌, జిల్లా కార్యదర్శి ఎస్‌.రాజా, సిపిఎం నాయకులు దగ్గు రాధాకష్ణ, ఇఫ్టూ నాయకులు గ్రీష్మ కుమార్‌, పిఒడబ్ల్యూ నాయకులు మల్లిక తదితరులు మద్దతు తెలిపారు. అంగన్‌వాడీ నాయకులు ఆర్‌.జ్యోతి, కె.భాస్కరం, వి.శ్రీదేవి, చీర దుర్గాభవాని, బి.పద్మజ టిపి.లక్ష్మీరామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️