హామీల అమలుకు జీవోలివ్వండి

Feb 7,2024 00:10

కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న పారిశుధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులు, నాయకులు
ప్రజాశక్తి- పల్నాడు జిల్లా :
సమస్యల పరిష్క్కారం కోసం ఇటీవల సమ్మె చేసిన తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో భాగంగా జీవోలు విడుదల చేయాలని మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు మంగళవారం స్థానిక పురపాలక సంఘం కార్యాలయం వద్ద నుండి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేసి జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌ మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ వేతనాలపై 9 మంది అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్టును బహిరంగపరచాలని డిమాండ్‌ చేశారు. 16 రోజులపాటు పారిశుధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులు సమ్మె చేస్తే దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపిందన్నారు. కార్మికులకు రూ.21 వేలు వేతనం, స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ వేతనాలు, క్లీన్‌ ఎన్విరాన్మెంట్‌ కార్మికులకు రూ.21 వేలు, హెల్త్‌ అలవెన్స్‌, పారిశుధ్య విభాగం డ్రైవర్లకు రూ.24,500, కార్మికులు మరణిస్తే మట్టి ఖర్చులు రూ.20 వేలు, కరోనా సమయంలో పనిచేసిన కార్మికులకు పని భద్రత కల్పిస్తూ రూ.15 వేల వేతనం, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, సమ్మె కాలానికి వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని వివరించారు. అయితే వాటిలో ఏ ఒక్క హామీనీ ఇంకా అమలు చేయలేదని అన్నారు. కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.75 వేలు, సాధారణ మతికి ఎక్స్‌ గ్రేషియా రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.7 లక్షలు, పర్మినెంట్‌ కార్మికులకు జిపిఎఫ్‌ ఖాతాలు తెరవడం, మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తదితర డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని, దీనిపై సత్వరమే జీవోను విడుదల చేసి అమలు చేయాలని కోరారు. లేకుంటే మరోసారి పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిం చారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు వి.చంద్రకళ, ప్రధాన కార్యదర్శి ఎ.సాల్మన్‌, నాయకులు విజయలక్ష్మి, మార్తమ్మ, బి.మల్లయ్య, పి.ఏసు, వెంకయ్య, సీతారామయ్య పాల్గొన్నారు.

➡️