హామీల అమలుకు21 తరువాత మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 16,2023 20:35

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  మున్సిపల్‌ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 21 తరువాత ఏ రోజు నుంచైనా సమ్మెలోకి వెళ్తామని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) విజయనగరం కార్పొరేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్‌ ఆర్‌ శ్రీరాములు నాయుడుకు శనివారం సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ జగన్మోహన్‌రావు, కార్యదర్శి బి.భాస్కరరావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చి నేడు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులని మాట మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కార్మికులందరినీ ఆప్కాస్‌లో చేర్చి తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు రిస్క్‌ అలవెన్స్‌ అమలు చేస్తామని మాట తప్పారని, ముషిడిపల్లి, రామ తీర్థాలు, నెల్లిమర్ల మాస్టర్‌ పంప్‌ హౌస్‌ కార్మికులకు టర్నీకి సిస్టం రద్దు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. నేటికీ మూడు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయని, పారిశుధ్య కార్మికులకు రెండు నెలల హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు ఉన్నాయని తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మాస్క్లు, బ్లౌజులు, చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్లు సాధనకు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సమ్మెలోకి వెళ్తామని తెలియజేశారు. సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో పైడిరాజు, రజిని, రాఘవ, రామచంద్రరావు, రాజు, పైడిరాజు, భాను పాల్గొన్నారు.

➡️