హామీల అమలులో సిఎం జగన్‌ ఆదర్శం

Feb 26,2024 21:34
ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
హామీల అమలులో సిఎం జగన్‌ ఆదర్శం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ప్రజలకు చెప్పిన ప్రతీ మాటను నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారని, రాజకీయాల్లో విశ్వసనీయతకు నిలువుటద్దంగా ముఖ్యమంత్రి నిలుస్తున్నారని, జగనన్న కోసం రానున్న ఎన్నికల్లో ప్రజలు మళ్లీ ఆయనవెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నబ్బీనగరం, పమిడిపాడు, మురగళ్ల గ్రామాల్లో విజయీభవయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న ఆలయాల్లో ఎంఎల్‌ఎ మేకపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయీభవయాత్రగా సాగిన ఎంఎల్‌ఎ మేకపాటి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. గతంలో వందల హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ప్రతిపక్ష పార్టీ జగనన్నను ఒంటరిగా ఎదుర్కొలేక పోత్తులతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, వారు మాటలు, హామీలు ఎన్నికలు జరిగిన మరుసటి రోజే మరిచిపోతారని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన వైసిపి ప్రభుత్వానికి ప్రజలకు మళ్లీ ఓటు అడిగే హక్కు ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపారని అన్నారు. సచివాలయాల వారీగా నిధులు కేటాయిస్తూ ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేశారని, ప్రజలకు డిబిటి, నాన్‌ డిబిటిల రూపంలో కోట్లాది రూపాయలను అందజేసినట్లు తెలిపారు. మురగళ్ల, పమిడిపాడు, నబ్బీనగరం గ్రామాలలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను అందించారని, సంక్షేమాభివృద్ధి కోసం రూ.6.78 కోట్లు డిబిటి, నాన్‌ డిబిటిల రూపంలో అందజేశారన్నారు. వైఎస్‌ఆర్‌ జలకళ పథకం ద్వారా 36 బోర్లు మంజూరు చేశారని, ఇందుకోసం రూ.43.20 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా రూ.16లక్షలను అభవృద్ధి పనుల కోసం అందజేసినట్లు, టిటిడి శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు, రానున్న రోజుల్లో ఆయా గ్రామలకు చేయబోయే అభివృద్ధిని కూడా ప్రజలందరికి తెలిసేలా గ్రామ సెంటర్‌లో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికల అనంతరం ఈ పనులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. పమిడిపాడు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా నిర్మించిన సిసిరోడ్డు, సైడ్‌ డ్రెయిన్లు నిర్మాణాలు, జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఏర్పాటు చేసిన ప్రతి ఇంటికి పైప్‌లైన్‌ నిర్మాణం, విస్తరణ పనులను ఎంఎల్‌ఎ మేకపాటి లాంఛనంగా ప్రారంభించారు. నబ్బీనగరంలో గ్రామకొలను నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభోత్సవం నిర్వహించారు. మురగళ్లలో రూ.20.80 లక్షలతో నిర్మించిన వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌తో పాటు సుమారు రూ.40 లక్షలతో నిర్మించిన సిసిరోడ్లు, సైడు కాలువల నిర్మాణాలు, పలు అభివృద్ధి పనులు పూర్తి కావడంతో వాటిని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం డాక్టర్‌ వింజం దొరసానమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా నిర్మాణం చేపట్టిన కళ్యాణ మండపాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు లక్ష్యం కంటే అధికంగా మంచి చేశామని, సంక్షేమ పథకాలను అందించామని, సంక్షేమ ప్రభుత్వ కొనసాగింపు కోసం ప్రజలంతా వైఎస్సార్సీపీని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి, రూరల్‌ మండల కన్వీనర్‌ జితేంద్ర నాగ్‌రెడ్డి, జెసిఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సిహెచ్‌ ఆదిశేషయ్య, కౌన్సిలర్‌ చెరుకూరు కామాక్షయ్య నాయుడు, శ్రీనివాసులు నాయుడు, సర్పంచులు సతీష్‌, బొలిగెర్ల వెంకటేశ్వర్లు, పువ్వాడి హరిత, వైసిపి నాయకులు గడ్డం శ్రీనివాసులు, రహీం, తదితరులు పాల్గొన్నారు.

➡️