హాస్టల్‌ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

Feb 29,2024 21:26

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మండలంలోని రావికోన గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతిగృహా(హాస్టల్‌)న్ని జిల్లా మలేరియా అధికారి(డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు గురువారం సందర్శించారు. విద్యార్థుల సిక్‌ రిజిష్టర్‌ను తనిఖీ చేసి ఇటీవల కాలంలో జ్వర లక్షణాలతో నమోదైన వారి వివరాలు, నిర్ధారణ పరీక్షలు, వాటి నివేదికలు పరిశీలించారు. ఇతర ఆరోగ్య సమస్యలతో నమోదైన వివరాలు, ఎక్కడ చికిత్స ఇస్తున్నారు, అందుకు సంబంధించిన ఓపి స్లిప్‌లు పరిశీలించారు. సిక్‌ రూంలో విద్యార్థులతో ఆయన మాట్లాడి వారి ఆరోగ్య పరిశీలన చేశారు. జ్వర లక్షణాలున్న విద్యార్థికి వైద్య సిబ్బందిచే నిర్ధారణ పరీక్ష చేయించారు. ప్రతి రోజూ ఆరోగ్య పర్యవేక్షణ చేయాలని, వైద్య సిబ్బంది ఇచ్చిన మందులను దగ్గరుండి వేయించాలని హాస్టల్‌ నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వైద్య సిబ్బందికి వెంటనే తెలియజేయాలన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. క్షేత్ర స్థాయి వైద్య సిబ్బంది ఎప్పటికపుడు హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య తనిఖీలు చేపట్టాలన్నారు. అనంతరం ఆయన వంటగది, హాస్టల్‌ పరిసరాలు పరిశీలించి వాడుక నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, తద్వారా దోమల ప్రభావం ఉండదని అన్నారు. డార్మేటరీ కిటికీలకు మెస్‌ల స్థితిని పరిశీలించారు. కార్యక్రమంలో ఎఎంఒ సూర్యనారాయణ, హెచ్‌ఎం కె.సిమ్మన్నదొర, వార్డెన్‌ నరసింహులు, హెల్త్‌ అసిస్టెంట్‌ బంగారునాయుడు తదితరులు ఉన్నారు.

➡️