రైతు గుండెల్లో తుపాను

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గురువారం నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శనివారం కల్లా తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడనం కారణంగా గుంటూరు, పల్నాడు జిల్లాలో బుధవారం అక్కడక్కడ జల్లులు పడ్డాయి. శనివారం నుంచి సోమవారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. డెల్టాలో కోతలకు సిద్ధంగా ఉన్న వరి, కోసి నూర్పిడికి సిద్ధంగా ఉన్న వరిపనలు తడిసిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా పంటలు చేతికి వచ్చే సమయంలో నవంబరులో తుపాన్లు వచ్చి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వరి కోతలకు సిద్ధంగా ఉండటంతో ఈసమయంలో తుపాను వస్తే ఎంతో కొంత నష్టం ఉంటుందంటున్నారు. పత్తి రెండో విడత తీయడానికి సిద్ధంగా ఉంది. మిర్చి పైరు తొలి విడత పూత, కాయ దశలో ఉంది. వాయుగుండం ప్రభావంతో ఆకాశం మేఘావృత్తమై జల్లులు పడుతుండటంతో చేతికి అంది వచ్చిన పంట నీటి పాలు అవుతుందోమోనన్న భయం రైతులను వెంటాడుతోంది. తెనాలి, పొన్నూరు, మంగళగిరి, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో జులైలో సాగు చేసిన రైతులు వరి కోతలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. కొంత మంది రైతులు కోసి పనలపై ఉంచారు. రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగితే ఇబ్బంది ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా తీయడానికి సిద్ధంగా ఉన్న పత్తి నాణ్యత దెబ్బతినడంతో పాటు తెగుళ్ల సమస్య పెరగనుంది. ఇప్పటికే వరిలో తెల్లదోమ ప్రభావం ఎక్కువగా ఉంది. పత్తిలో చీడపీడల ప్రభావం పెరిగితే మరింత నష్టం వుంటుందని భావిస్తున్నారు. మిర్చి పైరుకు కూడా తెగుళ్ల ప్రభావం పెరగవచ్చుననే ఆందోళన నెలకొంది. వర్షాభావం వల్ల ఈఏడాది ఖరీఫ్‌ సాగులో బాగా జాప్యం జరిగింది. రెండు లక్షల ఎకరాల్లో సాగుచేసిన మిర్చి పైరు ఆలస్యం కావడం వల్ల ఈఏడాది దిగుబడి తగ్గుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత కోతలకు సిద్ధంగా ఉండాల్సి ఉండగా పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల్లో ఇంకా పచ్చికాయలే కన్పిస్తున్నాయి. కాయలుపండి కోతలు కోసిన తరువాత ఆరబెట్టుకోవడానికి ఇంకా నెల రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు వర్షం కురిస్తే కాయ నాణ్యత తగ్గుతుందని చెబుతున్నారు. వర్షాల ప్రభావం తక్కువగా ఉన్నా చలి గాలులు పెరిగాయి.తగ్గిన విద్యుత్‌ వినియోగంకొన్ని రోజులుగా జిల్లాలో చలిగాలులు పెరిగాయి. పగటి సమయంలో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటోంది. దీంతో చలి తీవ్రత వల్ల విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గింది. పగటి కంటే రాత్రి వేళ వినియోగం తగ్గినట్టు అధికారులు తెలిపారు. తాజాగా అల్పపీడనం ప్రభావంతో చలిగాలులు వీస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు వణికిపోతున్నారు. చలి తీవ్రత పెరగడం వల్ల ఎసిల వినియోగం తగ్గింది. రగ్గులు, మఫర్లు, స్వెట్టర్లు వినియోగం పెరిగింది.

➡️