16న గ్రామీణ బంద్‌

Feb 7,2024 21:19

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలని కార్మిక, రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. బుధవారం పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో రైతు సంఘం నాయకులు పి.అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు, కార్మిక సంఘాల సమన్వయ కమిటీ నాయకులు బంటు దాసు మాట్లాడారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లు రద్దుచేసి, 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసరాల ధరలను తగ్గించాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల న్నారు. కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా పంట రుణాలు, గుర్తింపు కార్డులు, పంట నష్టం అందించాలన్నారు. ఉపాధిహామీ పనిదినాలను 200 రోజులకు విస్తరించి, రోజు వేతనం రూ.600 చెల్లించాలని, పట్టణాల్లో కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లపై ప్రజలను రక్షించండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఈ దేశవ్యాప్త గ్రామీణబంద్‌ జరుగుతుందని వివరించారు. బంద్‌లో ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు పి.రమణి, కె.మన్మథరావు, ఆర్‌.లక్ష్మునాయుడు, శ్రీ నాయుడు, నర్సింగరావు, వి.ఇందిర, సూరిబాబు, జి.వెంకట రమణ, టి.జీవ, రంజిత్‌, పి.సంఘం, కొల్లి గంగు నాయుడు, సూరయ్య, వై.మన్మథరావు, సర్వేశ్వర రావు, విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️