26 నుంచి మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మె

Dec 23,2023 21:27

ప్రజాశక్తి-బొబ్బిలి :   మున్సిపల్‌ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌( సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 26 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు నాయకులు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆయా మున్సిపల్‌ కేంద్రాల్లో శనివారం బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దతు ఇవ్వాలని బొబ్బిలి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పి. శంకర్రావు మాట్లాడతూ ప్రభుత్వం తక్షణమే మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ అధ్యక్షులు జి గౌరేష్‌, కార్యదర్శి జయ రామారావు, వాసు, చిన్ని కృష్ణ కార్మికులు పాల్గొన్నారు.

విజయనగరంటౌన్‌ : మున్సిపల్‌ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టనున్న సమ్మెను జయప్రదం చేయాలని ఆ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. జగన్మోహన్‌ రావు తెలిపారు. కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో పర్మినెంట్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని, ఇంజినీరింగ్‌ కార్మికులకు రిస్క్‌ అలవెన్స్‌, డ్రైవర్లకు హెల్త్‌ అలవెన్సు చెల్లిస్తామని, థర్డ్‌ పార్టీ విధానం, సిపిఎస్‌ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, నేటికీ నాలుగేళ్ల పూర్తయిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని తెలిపారు. అనేక రూపాల్లో ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు చెప్పారు. 2022లో మూడు నెలలు, 2023లో మూడు నెలలు జీతాలు బకాయిలు ఉన్నాయని, పిఎఫ్‌ ఇఎస్‌ఐ అమలు చేయడం లేదని అన్నారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని కోరారు. అనంతరం కమిషనర్‌ ఆర్‌.శ్రీరాములు నాయుడుకు వినతి అందించారు. సమావేశంలో అరుణ్‌, అప్పారావు, చందర్రావు, రాజు, రమేష్‌ నారాయణరావు , సూరి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

నెల్లిమర్ల : మున్సిపల్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 26 నుంచి జరిగే నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ నగర పంచాయతీ కార్మికులు కార్యాలయం నుంచి మొయిద జంక్షన్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బైక్‌ రాలీని ఆ యూనియన్‌ జిల్లా బాధ్యులు ఎ.జగన్మోహన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్మికులకు సిఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి యుఎస్‌ రవి కుమార్‌, సిఐటియు నగర ఉపాధ్యక్షులు రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. ర్యాలీలో యూనియన్‌ నాయకులు బాబురావు, శ్రీను, హరిబాబు, లక్ష్మీ పాల్గొన్నారు.

రాజాం : సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రామ్మూర్తి నాయుడు కోరారు. స్థానిక బొబ్బిలి జంక్షన్‌ నుండి ఎల్‌ఐసి ఆఫీస్‌ వరకు జరిగిన బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. యూనియన్‌ నాయకులు శ్రీనివాసరావు, అనిల్‌ కుమార్‌, గురువులు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️