పింఛను పెంపుతో 2,82,194 మందికి లబ్ది

Jun 14,2024 20:31

ప్రజాశక్తి-విజయనగరం కోట :  ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పింఛను మొత్తాన్ని రూ.4వేలకు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి సంతకం చేయడంతో జిల్లాలోని సామాజిక పింఛనుదారుల్లో హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం పింఛను మొత్తాన్ని పెంచడమే కాకుండా, ఈ పెంపును 2024 ఏప్రిల్‌ నుంచి వర్తింపజేస్తూ ఆదేశాలను జారీ చేశారు. ఈనేపథ్యంలో జిల్లాలోని వృద్ధులు, వితంతువులు, కళాకారులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘరోగుల్లో సంతోషం వెళ్లివిరుస్తోంది. ఎన్‌టిఆర్‌ భరోసాగా పేరు మారిన ఈ పింఛను పథకం ద్వారా, జులైలో సాధారణ పింఛను దారులు ఒక్కొక్కరూ రూ.7వేలు అందుకోనున్నారు. ఎన్‌టిఆర్‌ భరోసా పథకం ద్వారా జిల్లాలో 2,82,194 మందికి లబ్ధి చేకూరుతోంది. ప్రస్తుతం పింఛన్ల కోసం నెలకు రూ.82.45 కోట్లు చెల్లిస్తుండగా, ఇకనుంచీ అదనంగా రూ.35.17కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సామాజిక పింఛన్లను రూ.3వేలు నుంచి రూ.4వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. వికలాంగులకు ఇచ్చే పింఛను రూ.3వేలు నుంచి రూ.6వేలకు పెంచారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులు, రంగస్థల కళాకారులు, హిజ్రాలకు ఈ పెంపు వర్తిస్తుంది. వీరికి మూడు నెలల బకాయిలతో కలిపి జులైలో పింఛను అందనుంది. పూర్తిగా అంగవైకల్యం (మంచం, కుర్చీకి పరిమితమైనవారు) ఉన్నవారికి, బోదకాలు వ్యాధిగ్రస్తులు, కిడ్నీ, కాలేయ మార్పిడి జరిగిన వారికి ఇస్తున్న నెలవారీ పింఛను రూ.5వేలు నుంచి రూ.15వేలకు పెంచారు. జిల్లాలోని మొత్తం 15 కేటగిరీలకు చెందిన 2,82,194 మంది పింఛను దారులకు జూన్‌ నెలలో సుమారు రూ.82.45 కోట్లు చెల్లించగా, జులైలో గత మూడు నెలల బకాయిలతో కలిపి సుమారు రూ.187.36 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఆగస్టు నుంచి మాత్రం నెలకు సుమారుగా రూ.117.62 కోట్లు అవసరం ఉంటుంది.

➡️