3 ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పేరుతో వసూళ్లు – ఇండేన్‌ గ్యాస్‌ డీలర్‌ నిలువుదోపిడీ..!

ప్రజాశక్తి – రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : రెడ్డిగూడెం మండల కేంద్రంలో ఉన్న ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులు ఇకెవైసీ చేయించుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నూతనంగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చేసిన వాగ్దానం వలన ఇంకా ఆ పధకం విధి విధానాలు రాకముందే గ్యాస్‌ వినియోగదారులు అవగాహన లోపంతో నానా అవస్థలు పడుతున్నారు. రెడ్డిగూడెం మండల కేంద్రంలో ఉన్న ఇండేన్‌ గ్యాస్‌ డీలర్‌ తమ వినియోగదారులు ఐదు సంవత్సరాలుగా గ్యాస్‌ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఈకెవైసి చేసుకోవాలనీ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ సురక్ష పైప్‌ కోసం తప్పకుండా 200 రూపాయలకు కొనుగోలు చేయాలంటూ … వినియోగదారులు వద్ద నుంచి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలా అక్రమంగా బలవంతంగా 200 రూపాయలను వసూలు చేయడాన్ని ప్రశ్నించిన వినియోగదారులతో డీలర్‌ విజయ కుమార్‌ రెడ్డి తన ఇష్టం వచ్చినట్లు అవమానకరంగా, అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నాడని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇలా 200 రూపాయలు వసూలు చేస్తూ కూడా కొందరికి సురక్ష ట్యూబ్‌ ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని స్థానిక తహసీల్దార్‌ ను వివరణ కోరగా…

తహసీల్దార్‌ వివరణ :
ప్రభుత్వం అందిస్తామని చెప్పిన ఫ్రీ గ్యాస్‌ సిలిండర్‌ లకూ, ప్రస్తుతం రెడ్డిగూడెం లో ఇండేన్‌ గ్యాస్‌ డీలర్‌ చేసే ఈకెవైసి కి సంబంధం లేదనీ, ఉచిత గ్యాస్‌ కు సంబంధించిన విధి విధానాలు ఇంకా రాలేదని, వినియోగదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని సంబంధిత అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశామని తహసీల్దార్‌ తెలిపారు.

వినియోగదారుల అవస్థలు :
మండలంలో ఉన్న ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులు అందరూ ఇతర గ్రామాల నుంచి కూడా ఒకే సారి ఈకెవైసి చేయించుకునేందుకు రావడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి నీడ లేకపోవడంతో తీవ్రమైన ఎండకు, దాహార్తికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

➡️